Share News

జనజీవనం అస్తవ్యస్తం

ABN , Publish Date - Oct 29 , 2026 | 01:39 AM

‘ఆర్నబ్‌’ తుఫాన్‌ జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. అత్యధిక శాతం ప్రజలు విద్యుత్‌ సమస్య ఎదుర్కొన్నారు. సరఫరా ఆగిపోయి 40 గంటలు దాటినా ఇంకా చాలా ప్రాంతాలకు విద్యుత్‌ సదుపాయం అందుబాటులోకి రాలేదు. మంగళవారం రాత్రి అనేక మందికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. జీవీఎంసీ బుధవారం తాగునీటి సరఫరా నిలిపివేసింది. వీధుల్లో ఎక్కడికక్కడే కూలిన చెట్లు కాలు కదపనీయకుండా చేశాయి. వాహనం మీద బయటకు వెళితే ఎక్కడ ఏ ప్రమాదానికి గురికావలసి వస్తుందోననే భయం అందరినీ వెంటాడింది. ఐటీ ఉద్యోగాలు చేసే వారు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ తీసుకున్నా విద్యుత్‌ లేకపోవడంతో పని చేసుకునే అవకాశం లభించలేదు. ఉసూరుమంటూ తిరిగి వర్షంలోనే ఆఫీసులకు వెళ్లాల్సి వచ్చింది.

జనజీవనం అస్తవ్యస్తం

విద్యుత్‌, తాగునీటి సరఫరా బంద్‌

వీధుల్లో కూలిన చెట్లు...రాకపోకలకు ఇక్కట్లు

డాక్‌యార్డు రోడ్డులో నిలిచిన నీరు

విశాఖపట్నం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి):

‘ఆర్నబ్‌’ తుఫాన్‌ జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. అత్యధిక శాతం ప్రజలు విద్యుత్‌ సమస్య ఎదుర్కొన్నారు. సరఫరా ఆగిపోయి 40 గంటలు దాటినా ఇంకా చాలా ప్రాంతాలకు విద్యుత్‌ సదుపాయం అందుబాటులోకి రాలేదు. మంగళవారం రాత్రి అనేక మందికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. జీవీఎంసీ బుధవారం తాగునీటి సరఫరా నిలిపివేసింది. వీధుల్లో ఎక్కడికక్కడే కూలిన చెట్లు కాలు కదపనీయకుండా చేశాయి. వాహనం మీద బయటకు వెళితే ఎక్కడ ఏ ప్రమాదానికి గురికావలసి వస్తుందోననే భయం అందరినీ వెంటాడింది. ఐటీ ఉద్యోగాలు చేసే వారు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ తీసుకున్నా విద్యుత్‌ లేకపోవడంతో పని చేసుకునే అవకాశం లభించలేదు. ఉసూరుమంటూ తిరిగి వర్షంలోనే ఆఫీసులకు వెళ్లాల్సి వచ్చింది.

భారీగా కూలిన చెట్లు

హుద్‌హుద్‌ తుఫాన్‌ తరువాత నాటిన మొక్కలు చెట్లుగా మారి నగరం హరితవనంగా మారింది. అయితే తరచూ వచ్చే తుఫాన్లకు బలహీనంగా ఉన్న చెట్లు కూలిపోతున్నాయి. ఈసారి ఆర్నబ్‌ తుఫాన్‌ వల్ల గంటకు 120 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో భారీ చెట్లు నేలకూలాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భారీ వృక్షం నేలకొరింది. సుమారు ఇరవైకి పైగా చెట్లు అక్కడే కూలిపోయాయి. ఎంవీపీ కాలనీలో ఏ సెక్టార్‌కు వెళ్లినా కూలిన చెట్లే కనిపించాయి. వాహనాలు వెళ్లే అవకాశం లేదు. ఎంవీపీ కాలనీ బస్టాండ్‌ పక్కనున్న పోస్టాఫీసు వద్ద పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. సీతమ్మధారలో కూలిపోయిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలను జిల్లా అధికారులు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు దగ్గరుండి తొలగింపజేశారు. ఆరిలోవ హెల్త్‌సిటీలోని కేర్‌ ఆస్పత్రి ప్రాంగణంలో సిబ్బంది కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్లు గాలికి ఎగిరి బయట ఫుట్‌పాత్‌పై పడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తుఫాన్‌ గాలులకు విద్యుత్‌ స్తంభాలు, వైర్లు పడి ఆటోనగర్‌లో మంగళవారం ఒకరు, సింహాచలంలో బుధవారం ఒకరు మరణించారు.

విశాఖ నుంచి భీమిలి వరకు తీరం కోత

తుఫాన్‌ వల్ల సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడడం, తీరాన్ని బలంగా తాకడంతో కోస్టల్‌ బ్యాటరీ నుంచి ఆర్‌కే బీచ్‌, సాగర్‌నగర్‌, రుషికొండ, మంగమారిపేట, భీమిలి వరకు అనేక ప్రాంతాల్లో తీరం కోతకు గురైంది. రహదారులు చాలాచోట్ల దెబ్బతిన్నాయి. బీచ్‌ను చూడడానికి చాలా మంది వస్తుండడంతో నగర పోలీస్‌ కమిషనర్‌ పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ఎవరినీ బీచ్‌లోకి వెళ్లకుండా బారికేడ్లు వేయించారు.

డాక్‌యార్డ్‌ మార్గంలో మోకాలు లోతున నీరు

సింధియా నుంచి డాక్‌యార్డ్‌ మీదుగా నగరంలోకి వచ్చే మార్గంలో మోకాలు లోతున వరదనీరు నిలిచిపోయింది. దాంతో ద్విచక్ర వాహనదారులు రైల్వే ట్రాక్‌పైకి ఎక్కి దాని మీదుగా వాహనాలు నడిపించుకుంటూ నగరంలోకి వచ్చారు. భారీవర్షాలు కురిసిన ప్రతిసారీ ఇదే సమస్య పునరావృతం కావడంతో దీనికి పరిష్కారం చూపాలని అక్కడకు విధులకు వెళ్లే ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. తూర్పు, ఉత్తర నియోజకవర్గాల్లోని కొండవాలు ప్రాంతాల్లో కొన్ని చోట్ల మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. అక్కడి నుంచి నివాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. 55వ వార్డు కస్తూరీనగర్‌లో కొండచరియలు విరిగి పడ్డాయి.

పార్కింగ్‌లోనే ఎలక్ర్టిక్‌ వాహనాలు

ఇటీవల కాలంలో ఇంధన పొదుపు, కాలుష్య రహితం పేరుతో చాలామంది ఎలక్ర్టిక్‌ వాహనాలు కొనుగోలు చేశారు. నగరంలో కార్లు, స్కూటర్లు వేల సంఖ్యలోనే నగరంలో తిరుగుతున్నాయి. ఇప్పుడు తుఫాన్‌ వల్ల విద్యుత్‌ సరఫరా 40 గంటల పాటు నిలిచిపోవడంతో ఆయా వాహనాలకు చార్జింగ్‌ సౌకర్యం కరవైంది. దాంతో వాటి యాజమానులు ర్యాపిడో, ఊబర్‌ బుక్‌ చేసుకొని బయటకు వెళ్లాల్సి వస్తోంది. విద్యుత్‌ సరఫరా వెంటనే పునరుద్ధరించకపోతే చాలా సమస్యలు ఎదుర్కొంటామని వారు వాపోతున్నారు.

నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

తుఫాన్‌ తీరం దాటినా ప్రభావం ఇంకా తగ్గకపోవడం, గాలులు, వర్షం బుఽధవారం రాత్రి కూడా కొనసాగడంతో అధికారులు ఆంక్షలు విధించారు. రాత్రి తొమ్మిది గంటల తరువాత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఆంక్షలు గురువారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఉంటాయన్నారు.

Updated Date - Oct 29 , 2026 | 01:40 AM