Share News

అర్ధంతరంగా నిలిచిన డి.కొత్తూరు-మొట్టలగుమ్మి రోడ్డు

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:23 PM

మారుమూల డి.కొత్తూరు-మొట్టలగుమ్మి రోడ్డు పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. దీంతో మొట్టలగుమ్మి గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అర్ధంతరంగా నిలిచిన డి.కొత్తూరు-మొట్టలగుమ్మి రోడ్డు
రోడ్డు కోసం రాళ్లు సరిచేస్తున్న ఎక్స్‌కవేటర్‌. ప్రస్తుతం పనులు నిలిపివేతతో రోడ్డుపైనే ఉన్క ఎక్స్‌కవేటర్‌

రెండు కిలోమీటర్ల రోడ్డుకు రూ.3.46 కోట్లు మంజూరు

పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌

బిల్లుల చెల్లింపు జాప్యంతో పనులు ఆపేసిన కాంట్రాక్టర్‌

పెదబయలు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): పెదబయలు మండలానికి చెందిన బొంగరం పంచాయతీలోని మారుమూల మొట్టలగుమ్మి గిరిజన గ్రామానికి పక్కా రోడ్డు లేదు. తమ గ్రామానికి పక్కా రహదారి కల్పించాలని ఏళ్ల తరబడి గ్రామస్థులు అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే డి.కొత్తూరు గ్రామం నుంచి మొట్టలగుమ్మి వరకు రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్‌ శాఖల ద్వారా రూ.3.46 కోట్లు మంజూరు చేసింది. ఈ రోడ్డు పనులను ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర ప్రారంభించారు. దీంతో కాంట్రాక్టర్‌ పనులను ప్రారంభించారు. రోడ్డుకు మధ్యలో ఉన్న బండరాళ్లను బ్లాస్టింగ్‌ చేయించారు. అవే రాళ్లను రోడ్డుపై ఎక్స్‌కవేటర్‌తో సరిచేశారు. అయితే చేసిన పనులకు బిల్లుల చెల్లింపు జరగలేదు. దీంతో కాంట్రాక్టర్‌ ఎక్కడి పనులు అక్కడే నిలిపేశాడు. రోడ్డుకు మధ్యన ఎక్స్‌కవేటర్‌ను ఉంచేశారు. దీంతో ఈ మార్గంలో కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నడచి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయిందని గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు, గర్భిణులు, వృద్ధులను గ్రామం నుంచి తరలించడం కష్టసాధ్యంగా మారిందని గ్రామస్థులు వాపోతున్నారు. నిర్మాణ దశలో నిలిచిన మొట్టలగుమ్మి రహదారిని పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

పీఆర్‌ జేఈఈ వివరణ

ఈ విషయమై పంచాయతీరాజ్‌ జేఈఈ శివరామయ్యను వివరణ కోరగా ఉపాధి హామీ పథకం నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించలేదన్నారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఆగిన రోడ్డు పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Updated Date - Jul 17 , 2026 | 11:23 PM