Share News

సిలిండర్‌ రూ.2,000

ABN , Publish Date - Mar 20 , 2026 | 01:05 AM

గ్యాస్‌ సిలిండర్ల పంపిణీలో కొందరు డెలివరీ బాయ్స్‌ చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

సిలిండర్‌ రూ.2,000

గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌ చేతివాటం

చిరు వ్యాపారులకు డొమెస్టిక్‌ సిలిండర్ల అమ్మకం

పెరిగిన అల్పాహారం ధరలు

విశాఖపట్నం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి):

గ్యాస్‌ సిలిండర్ల పంపిణీలో కొందరు డెలివరీ బాయ్స్‌ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వినియోగదారుడికి ఇవ్వాల్సిన సిలిండర్‌ను చిరు వ్యాపారులకు రూ.2,000 నుంచి రూ.2,500కు అమ్ముకుంటున్నారు. యుద్ధం ప్రభావం గ్యాస్‌ సరఫరాపై పడడంతో వాణిజ్య సిలిండర్ల అమ్మకాలను కొన్ని ఏజెన్సీలు నిలిపివేశాయి. ఇక తోపుడుబండ్లపై టిఫిన్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ వ్యాపారాలు నిర్వహించేవారంతా గతంలోనూ డొమెస్టిక్‌ సిలిండర్లనే వినియోగించేవారు. ఇప్పుడు కొరత రావడంతో డెలివరీ బాయ్స్‌ సిలిండర్‌ రేటు పెంచేశారు. వారం క్రితం వరకూ రూ.1,500 తీసుకోగా, ఇప్పుడు రూ.రెండు వేలు చెబుతున్నారు. కొన్నిచోట్ల వ్యాపారులు సిలిండర్‌కు రూ.2,500 నుంచి రూ.మూడు వేల వరకు చెల్లిస్తున్నారు. ఇదిలావుండగా కొంతమంది వినియోగదారులే సిలిండర్‌ బుక్‌ చేసుకుని తమ ప్రాంతంలో అవసరం ఉన్న చిరు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. జిల్లా యంత్రాంగం, పౌర సరఫరాల శాఖ గత పది రోజుల నుంచి రోజువారీ సమీక్ష చేస్తున్నా సిలిండర్ల సరఫరాలో జాప్యం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏజెన్సీల వారీగా డెలివరీ బాయ్స్‌తో సమావేశాలు నిర్వహించి గట్టిగా హెచ్చరించాలని వినియోగదారులు సూచిస్తున్నారు.

ఇడ్లీ, దోశపై రూ.5 నుంచి రూ.10 వరకు పెంపు

వంట గ్యాస్‌ కొరత నేపథ్యంలో చిరు వ్యాపారులు ఇడ్లీ, దోశపై రూ.5 నుంచి రూ. 10 వరకూ ధర పెంచారు. టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులు గ్యాస్‌పై ఆధారపడుతుంటారు. కొందరు కమర్షియల్‌ సిలిండర్లు, మరికొందరు డొమెస్టిక్‌ సిలిండర్ల వినియోగిస్తుంటారు. యుద్ధం కారణంగా వాణిజ్య సిలిండర్లు సరఫరా తగ్గింది. దీంతో వ్యాపారులంతా డొమెస్టిక్‌ సిలిండర్లపై ఆధారపడాల్సి వచ్చింది. డొమెస్టిక్‌ సిలిండర్లను డెలివరీ బాయ్స్‌ వద్ద రూ.రెండు వేలు అంతకంటే ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుండడంతో అదనపు భారం పడుతోంది. దీంతో ధరలు పెంచేశారు. ఇడ్లీపై రూ.5, దోశ, పూరీ, చపాతీ, పరోటాపై రూ.10 పెంచారు. ఇక సాయంత్రం పూట ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు కొందరు రూ.10 వరకు రేటు పెంచగా, మరొకొందరు ఇచ్చే పరిమాణాన్ని తగ్గిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొద్దిరోజుల తరువాత సెంటర్లు మూతపడతాయని వ్యాపారులు అంటున్నారు. అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డు జంక్షన్‌లో గల హోటల్‌ గురువారం గ్యాస్‌ కొరతతో మూతపడింది.

కట్టెల పొయ్యిలపై వంటలు

మధురవాడ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): గ్యాస్‌ కొరత కారణంగా మధురవాడ, మిథిలాపురి వుడా కాలనీ, స్వతంత్రనగర్‌ కాలనీ, వాంబే కాలనీ, నగరంపాలెం, పోతినమల్లయ్యపాలెం, ఐటీ జంక్షన్‌ తదితర ప్రాంతాల్లో సుమారు పది హోటళ్లు మూతపడ్డాయి. కొన్ని కర్రీ పాయింట్లు తెరుచుకోవడం లేదు. కొందరు మాత్రం తమకున్న పరిధిలో కట్టెల పొయ్యిపై ఆరుబయట వంటలు చేస్తూ రెండు, మూడు రకాల టిఫిన్లు, ఒక కూర, పచ్చడి, అన్నం, సాంబారు తయారుచేస్తున్నారు. గ్యాస్‌ కొరత కారణంగా హోటళ్లు, టిఫిన్‌ బళ్లు, చాయ్‌ దుకాణాలు మూతపడడంతో ఆ రంగంలో ఉపాధి పొందిన పలువురు వీధినపడ్డారు. వారంతా తాత్కాలికంగా పొట్టకూటికోసం ఇతర పనులకు వెళుతున్నారు.

Updated Date - Mar 20 , 2026 | 01:05 AM