తప్పిన తుఫాన్ ముప్పు
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:06 AM
జిల్లాకు ‘అక్వాన్’ తుఫాన్ ముప్పు తప్పిందన్న సమాచారంతో ప్రజలు.. ముఖ్యంగా రైతులు ఊపరిపీల్చుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్.. మధ్య కోస్తా లేదా ఉత్తర కోస్తాలో తీరం దాటుతుందని తొలుత భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
దక్షిణ ఒడిశా వద్ద తీరం దాటిని ‘అక్వాన్’
ఊపిరి పీల్చుకున్న అన్నదాతలు
అనకాపల్లి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు ‘అక్వాన్’ తుఫాన్ ముప్పు తప్పిందన్న సమాచారంతో ప్రజలు.. ముఖ్యంగా రైతులు ఊపరిపీల్చుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్.. మధ్య కోస్తా లేదా ఉత్తర కోస్తాలో తీరం దాటుతుందని తొలుత భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఇందుకు భిన్నంగా శుక్రవారం ఉదయం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటింది. దీంతో అనకాపల్లి జిల్లాపై తుఫాన్ ప్రభావం పడలేదు. జిల్లా రైతులకు ఇది ఎంతో ఊరటనిచ్చింది. ప్రస్తుతం ఖరీఫ్ వరి పంట గింజ కట్టే దశ నుంచి కోత దశ వరకు వుంది. ఇటువంటి తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావం వల్ల భారీ ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ నాలుగైదు రోజుల నుంచి హెచ్చరిస్తుండడంతో జిల్లా రైతులు తీవ్ర ఆందోళన చెందారు. అప్పటికే కోత కోసిన పొలాల్లో వరి పనలను ఆదరాబాదరాగా కుప్పలు వేశారు. ఇతర రైతులు వరి కోతలను వాయిదా వేసుకున్నారు. కాగా జిల్లాపై తుఫాన్ ప్రభావంతో లేకపోయినప్పటికీ శుక్రవారం రోజంతా ముసురు వాతావరణం నెలకొని, శీతల గాలులు వీచాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. శనివారం వాతావరణం తెరిపిచ్చి ఎండ కాసే అవకాశం వుండడంతో రైతులు వరి కోతలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరో పక్షం రోజుల వరకు వర్షాలు కురవకపోతే వరి పంట చేతికి వస్తుందని రైతులు చెబుతున్నారు.