Share News

జిల్లాపై తుఫాన్‌ పడగ

ABN , Publish Date - Oct 27 , 2026 | 01:49 AM

రాబోయే మూడు రోజుల్లో జిల్లాకు తుఫాన్‌ ముప్పు పొంచివున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా కోరారు.

జిల్లాపై తుఫాన్‌ పడగ

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

రోడ్లకు గండ్లు పడితే తక్షణమే పునరుద్ధణ పనులు

ఈదురు గాలులకు కూలిపోయే అవకాశం ఉన్న చెట్లను, కొమ్మలను తొలగించాలి

లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు

ప్రసవ సమయం దగ్గరలో ఉన్న గర్భిణులను ఆస్పత్రుల్లో చేర్చండి

అధికారులకు కలెక్టర్‌, ఎస్పీ ఆదేశాలు

కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌

అనకాపల్లి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):

రాబోయే మూడు రోజుల్లో జిల్లాకు తుఫాన్‌ ముప్పు పొంచివున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా కోరారు. తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం వున్నందున తగిన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్‌ ప్రభావం, ముందస్తు చేపట్టాల్సిన చర్యలపై సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం నుంచి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వరదల కారణంగా ఎక్కడైనా రహదారులకు గండ్లు పడినా, తీవ్రంగా దెబ్బతిన్నా.. తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ ఇంజనీరింగ్‌ శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. భారీ వృక్షాల కొమ్మలను నరికివేయాలని, బలహీనంగా వున్న చెట్లను తొలగించాలని, ఇందుకు అవసరమైన ఎక్స్‌కవేటర్లు, ట్రీ కటింగ్‌ మిషన్లను అందుబాటులో వుంచుకోవాలని తెలిపారు. జిల్లాలో వున్న అన్ని జలాశయాలు, చెరువుల్లో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వరద నీరు చేరే అవకాశం వుందని, అందువల్ల నీటి నిల్వలు ప్రమాద స్థాయికి చేరకముందే కొంతమంది నీటిని దిగువకు విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, రేకుల షెడ్లలో నివసిస్తున్న వారిని వెంటనే పునరావస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. బలమైన గాలుల వల్ల ప్రమాదాలు జరగకుండా హోర్డింగులను వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు.

భారీ వర్షాలు కురిసే అవకాశం వున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించాలని, అక్కడ స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన ఆహారం, నిరంతర విద్యుత్తు సదుపాయం కల్పించాని ఆదేశించారు. ఆసుపత్రుల్లో వైద్యసిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. తుఫాన్‌ నేపథ్యంలో నవంబరు పదో తేదీలోపు ప్రసవం జరిగే అవకాశం వున్న గర్భిణులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్చాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు తమ పరిధిలో ప్రసవానికి దగ్గరలో వున్న గర్భిణులను గుర్తించి వెంటనే ఆస్పత్రులకు తరలించాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌లు, అనధికార పార్కింగ్‌లు లేకుండా హైవే పెట్రోలింగ్‌ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ తదితర శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Updated Date - Oct 27 , 2026 | 01:49 AM