తుఫాన్ అలర్ట్
ABN , Publish Date - Oct 26 , 2026 | 01:27 AM
తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు.
జిల్లాలో ముందస్తు చర్యలు
అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు
అందుబాటులో 8912590100, 8912590102 నంబర్లు
నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారుల నియామకం
ఏయూకు సెలవులు ప్రకటించిన అధికారులు
విశాఖపట్నం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి):
తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. జిల్లా అధికారులతో ఆదివారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ వాయుగుండాన్ని ఎదుర్కొనేందుకు అన్నిశాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల అంచనాల ప్రకారం ఈ నెల 26 నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, 27న మోస్తరు నుంచి భారీ వర్షాలు, 28, 29 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 28 లేదా 29 తేదీల్లో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని, ఆ తరువాత కూడా భారీ వర్షాలు కురవచ్చన్నారు. మొంథా తుఫాన్ స్థాయిలో వాయుగుండం ప్రభావం చూపే అవకాశం ఉందని, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
కలెక్టరేట్, జీవీఎంసీ కార్యాలయంతో పాటు జోనల్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు కంట్రోల్ రూమ్‌లతో అనుసంధానమై, ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రిజర్వాయర్లతో నీటి మట్టాలను నిరంతరం పరిశీలించా లని, కొండవాలు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమ త్తం చేయాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాల న్నారు. వాయుగుండాన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. గతంలో ఏడు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఈసారి కూడా ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన చర్యలు చేపట్టాలని, చెట్లు, కొమ్మలను తొలగించే యంత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా జీవీఎంసీ, ఈపీడీసీఎల్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. మత్స్య, వెద్య ఆరోగ్యశాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, 10,4 108 వాహనాలను సిద్ధంగా ఉంచడంతోపాటు వైద్య బృందాలు, మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలకు తక్షణ సేవలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రసవ సమయం దగ్గరపడిన గర్భిణులను ముందుగానే ఆస్పత్రులకు తరలించాలన్నారు. మత్స్యకారులకు వేటకు వెళ్లకుండా చూడాలని, పర్యాటకులు, ప్రజలు సముద్రంలో దిగకుండా అప్రమత్తం చేయాలన్నారు. అధికారులు పనిచేసే ప్రదేశాల్లోనే ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు, డీసీఎం గోవింద్, ఆర్డీవోలు సంగీత్‌మాధుర్, దిలీప్ చక్రవర్తి, నియోజకవర్గాలు, మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
తీవ్ర వాయుగుండం, వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసినట్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, డీపీఎం టి.గోవింద్ తెలిపారు. 24 గంటలు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు సహాయ, సహకారాలు అందిస్తారన్నారు. ప్రజలకు ఎలాంటి సహకారం కావాలన్నా కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు 8912590100, 8912590102 నంబర్లను సంప్రదించాల న్నారు. జోనల్, మండల స్థాయి అధికారులు జిల్లా కంట్రోల్‌రూమ్‌తో అనుసంధానం కావాలని ఆదేశించారు.
ఏయూకు 31వరకు సెలవులు
తుఫాన్ నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అధికారులు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలు కురిసే అవకాశముండడంతో సోమవారం నుంచి ఈ నెల 31 వరకు తరగతులను సస్పెండ్ చేశారు. వసతిగృహాలను కూడా మూసివేస్తున్నామన్నారు. దీంతో విద్యార్థులు ఇళ్లకు పయన మయ్యారు. సదూర ప్రాంతాల విద్యార్థుల కోసం ఒక హాస్టల్ ను తెరిచి ఉంచారు. తరగతులు పోకుండా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామని రిజిస్ర్టార్ ప్రొఫెసర్ కె.రాంబాబు తెలిపారు.
ప్రత్యేక అధికారులు వీరే
విశాఖపట్నం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో భారీ వర్షాలు, విపత్తు నిర్వహణ చర్యలను పర్యవేక్షించేందుకు మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ ఎం.అభిషిక్త్‌కిశోర్ ఉత్తర్వులు జారీచేశారు. విశాఖ రూరల్ మండలానికి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మహరాణిపేట మండలానికి విశాఖపట్నం ఆర్డీవో, సీతమ్మధార మండలానికి జిల్లా సహకార అధికారి, గోపాలపట్నం మండ లానికి జిల్లా పర్యాటక అధికారి, ములగాడ మండలానికి వీఎం ఆర్‌డీఏ ఓఎస్‌డీ (7992416144), పెదగంట్యాడ మండలానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (9849903829) పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రత్యేక అధికారులు... ఫోన్ నంబర్లు
భీమిలి నియోజకవర్గం - భీమిలి ఆర్డీవో - 9849903854
తూర్పు - ఎస్సీ కార్పొరేషన్ ఈడీ - 9848355128
దక్షిణం - విశాఖ ఆర్డీవో - 9849903825
ఉత్తరం - జిల్లా సహకార అధికారి 9100109164
పశ్చిమం - జిల్లా పర్యాటక అధికారి - 9000013610
గాజువాక వీఎంఆర్‌డీఏ ఎస్టేట్ అధికారి - 6309944449
పెందుర్తి - జడ్పీ సీఈవో - 9849902145
ఆనందపురం - జెడ్‌ఎం, ఏపీఐఐసీ - 9848933874
పద్మనాభం - స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ - 9494918484