Share News

నగరంలో సైక్లింగ్‌ ట్రాక్‌లు

ABN , Publish Date - Jul 06 , 2026 | 01:12 AM

స్మార్ట్‌సిటీగా గుర్తింపుపొందిన విశాఖలో సైక్లింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో జీవీఎంసీ ప్రత్యేకంగా సైక్లింగ్‌ ట్రాక్‌లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

నగరంలో  సైక్లింగ్‌ ట్రాక్‌లు

ఎండాడ, సాగర్‌నగర్‌, ముడసర్లోవలో ప్రయోగాత్మకంగా అమలు

రూ.ఏడు కోట్లతో ఎనిమిది కిలోమీటర్ల మేర ట్రాక్‌ నిర్మాణం

పర్యాటకం, సైక్లింగ్‌ను ప్రోత్సహించడమే ధ్యేయం

వీఈఆర్‌లో భాగంగా జీవీఎంసీ ప్రయత్నం

కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్యం మెరుగుపరచడమే లక్ష్యం

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

స్మార్ట్‌సిటీగా గుర్తింపుపొందిన విశాఖలో సైక్లింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో జీవీఎంసీ ప్రత్యేకంగా సైక్లింగ్‌ ట్రాక్‌లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. పైలట్‌ప్రాజెక్టుగా మూడు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేసి, దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించింది. సైక్లింగ్‌ట్రాక్‌లను అందుబాటులోకి తెస్తే పర్యాటకానికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

నగరం శరవేగంగా విస్తరిస్తుండడంతో వాహనాల సంఖ్య అదేస్థాయిలో పెరుగుతోంది. దీనివల్ల రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయి నిత్యం ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడుతున్నాయి. వ్యాయామంలో భాగంగా సైకిల్‌ తొక్కాలని చాలామంది భావిస్తున్నప్పటికీ ఏవాహనం ఎటువైపు నుంచి ఢీకొడుతుందోననే భయంతో ప్రతీపనికి వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ప్రజలకు సరైన వ్యాయామం లేక ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో పాటు వాహనాల నుంచి వెలువడే పొగ కాలుష్యానికి దారితీస్తోంది. పైగా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి నగరానికి వచ్చినవారు కనుచూపుమేరలో కనిపించే సముద్రాన్ని చూస్తూ సైక్లింగ్‌ చేయాలనునేవారికి ఆ సదుపాయం లేక నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌(వీఈఆర్‌) అభివృద్ధికి జారీచేసిన ఆదేశాలను అనుసరించి నగరంలో మూడు చోట్ల సైక్లింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటుచేయాలని జీవీఎంసీ కమిషనర్‌ నిర్ణయించారు.

పైలట్‌ ప్రాజెక్టుగా...

నగరమంతటా ఒకేసారి కాకుండా ముడసర్లోవ, సాగర్‌నగర్‌, ఎండాడ నుంచి గీతం యూనివర్సిటీకి వెళ్లేరోడ్డులో మూడుచోట్ల ప్రయోగాత్మకంగా సైక్లింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ముడసర్లోవ పార్కుచుట్టూ 5.2 కిలోమీటర్లు, సాగర్‌నగర్‌ నుంచి రాడిసన్‌బ్లూ హోటల్‌ వరకు 800 మీటర్లు, ఎండాడ నుంచి గీతంయూనివర్సిటీ వరకు రెండు కిలోమీటర్లు మొత్తం ఎనిమిది కిలోమీటర్ల పొడవున సైక్లింగ్‌ కోసం ప్రత్యేక ట్రాక్‌ల పనులు ప్రారంభించారు. ఇందుకోసం రూ.ఏడు కోట్లు వెచ్చించి ప్రత్యేకంగా రోడ్లు నిర్మించి, దానిపై థర్మల్‌ పెయింటింగ్‌ వేయడం, రోడ్డుమధ్యలో మార్కింగ్‌, స్టడ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ముడసర్లోవ పార్కు వద్ద ఇప్పటికే వేలాదిమంది వాకింగ్‌ చేస్తున్నారు. సాగర్‌నగర్‌ నుంచి ఆర్కేబీచ్‌ వరకు నిత్యం వేలాదిమంది వాకింగ్‌, జాగింగ్‌ వంటి వ్యాయామాలు చేస్తున్నారు. వీరిలో సైక్లింగ్‌పై ఆసక్తి ఉన్నవారితోపాటు ఇతరులు కూడా తమకు సమీపంలోని ట్రాక్‌కు వెళ్లి సైక్లింగ్‌ చేసేందుకు వీలుంటుంది. దీనివల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడడంతోపాటు నగరానికి వచ్చే పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ముడసర్లోవపార్కు వద్ద సైక్లింగ్‌ ట్రాక్‌ నిర్మాణపనులు జరుగుతుండగా, మిగిలిన రెండుచోట్ల త్వరలోనే ప్రారంభమవుతాయని చెబుతున్నారు. మూడుచోట్ల మెరుగైన ఫలితాలు వస్తే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - Jul 06 , 2026 | 01:12 AM