సైక్లింగ్ డే కు శ్రీకారం
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:57 AM
జీవీఎంసీ పరిదిలో ప్రతి సోమవారం స్వచ్ఛందంగా సైక్లింగ్ డేగా ఆచరించాలనే నిర్ణయానికి కమిషనర్ కేతన్‌గార్గ్ శ్రీకారం చుట్టారు.
సైకిల్‌పై కార్యాలయానికి జీవీఎంసీ కమిషనర్
వెంకోజీపాలెం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిదిలో ప్రతి సోమవారం స్వచ్ఛందంగా సైక్లింగ్ డేగా ఆచరించాలనే నిర్ణయానికి కమిషనర్ కేతన్‌గార్గ్ శ్రీకారం చుట్టారు. తన అధికారిక నివాసం (బంగ్లా) నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు సైకిల్‌పై ప్రయాణించి విధులకు హాజరయ్యారు. ఆయనతో పాటు జీవీఎంసీ సిబ్బంది కూడా సైకిళ్లపై కార్యాలయానికి చేరుకుని కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ప్రతి సోమవారాన్ని ‘సైక్లింగ్ డే’ గా ఆచరించాలని జీవీఎంసీ నిర్ణయించిందన్నారు. జీవీఎంసీలో అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు ప్రతి సోమవారం తప్పనిసరిగా సైకిళ్లపై కార్యాలయాలకు రావాలని సూచించారు. సైక్లింగ్ వలన ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని, మానసిక ఉల్లాసం కలుగుతుందని, ఊబకాయం తగ్గుతుందని, వ్యాధుల నివారణకు దోహదపడుతుందన్నారు. అంతేకాకుండా వాహనాల వినియోగం తగ్గిస్తే వాయు కాలుష్యం తగ్గి, ఇంధన పొదుపు సాధ్యమన్నారు. నగర వాసులు కూడా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా ఆచరించాలని పిలుపునిచ్చారు. రోజువారీ జీవితంలో సైక్లింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు. భావితరాలకు పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన, ఆరోగ్యవంతమైన విశాఖ అందించడం మనందరి సామాజిక బాధ్యతని తెలిపారు. ‘గ్రీన్ వైజాగ్-హెల్తీ వైజాగ్’ లక్ష్యసాధనలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు భాగస్వాములు కావాలని, ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవర్చుకుని సైక్లింగ్‌ను ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు.