రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:01 AM
డిజిటల్ అరెస్టు, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలు నగరంలో ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి.
డిజిటల్ అరెస్టు, ట్రేడింగ్ పేరుతో మోసం
ఈడీ, కస్టమ్స్, సీబీఐ, ముంబై పోలీసుల పేరుతో బెదిరింపులు
విశ్రాంత ఉద్యోగులు, మహిళలే టార్గెట్
ఎంత అవగాహన కల్పిస్తున్నా కానరాని ప్రయోజనం
బాధితుల్లో విద్యాధికులే అధికం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
పెదరుషికొండ ప్రాంతానికి చెందిన విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నూకల సీతారామాంజనేయులు (77)కు టెలిగ్రామ్ యాప్‌లో కాల్ చేసిన కొందరు...తాము ముంబై పోలీసులమని చెప్పి, సీబీఐ కేసు, డిజిటల్ అరెస్టు అంటూ బెదిరించి రూ.1,60,54,000 దోచుకున్నారు.
పరిమితికి మించి నగదు బ్యాంకు ఖాతాలో ఉన్నందున ఆడిట్ చేయాలంటూ ఆర్‌బీఐ అధికారుల పేరుతో సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన 81 ఏళ్ల విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను బెదిరించి రూ.11 లక్షలు కొల్లగొట్టేశారు.
డిజిటల్ అరెస్టు, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలు నగరంలో ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. విద్యావంతులైన విశ్రాంత ఉద్యోగులు, పెన్షన్ తీసుకునే మహిళలనే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్ అధికారులు, సీబీఐ అధికారులు, ముంబై పోలీసులు పేరుతో అమాయకులను బెదిరించి, అందినకాడికి గుంజుకుంటున్నారు. ఈ తరహా మోసాలు పెరుగుతున్నాయి. పెదరుషికొండ ప్రాంతానికి చెందిన నూకల సీతారామాంజనేయులు (77) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. పిల్లలంతా విదేశాల్లో ఉండడంతో ఒంటరిగా ఉంటున్నారు. కొన్నాళ్ల కిందట గుర్తుతెలియని వ్యక్తులు అతనికి వీడియో కాల్ చేసి ‘బ్లూడార్ట్ కొరియర్‌లో మీకు ఒక పార్శిల్ వచ్చింది. అందులో విలువైన వస్తువులతోపాటు పన్ను చెల్లించని వస్తువులు కూడా ఉన్నాయి. సమగ్రమైన వివరాలు ఇవ్వకపోతే సీబీఐ అధికారులు కేసు నమోదు చేస్తారంటూ’ బెదిరించారు. కొద్దిసేపటికే పోలీస్ యూనిఫారం ధరించిన ఒకరు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి...తాను సీబీఐ అధికారినని పరిచయం చేసుకుని డిజిటల్ అరెస్టు చేశామని బెదిరించి, అతని ఖాతా వివరాలు సేకరించి అందులోని రూ.1,60,54,000 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసుకున్నాడు. దీంతో మోసపోయినట్టు గుర్తించిన బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆ మొత్తం బదిలీ చేసిన ఖాతాల వివరాలు గుర్తించారు. తాము కమీషన్ ఇస్తామంటే వేరెవరికో తమ ఖాతా వివరాలు, ఏటీఎం కార్డులను ఇచ్చామని వారంతా చెప్పడంతో సైబర్ నేరగాళ్లను గుర్తించే పనిలో పడ్డారు. ఖాతాలు సరఫరా చేసిన వారిపై కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. అలాగే నగరానికి చెందిన విశ్రాంతి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకరికి గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తాను ఆర్‌బీఐ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నారు. ‘మీ ఖాతాలో పరిమితికి మించిన నగదు ఉందని, నిబంధనలకు విరుద్ధం కావడంతో కేసు నమోదుచేయాల్సి ఉంటుందని’ బెదిరించారు. కేసు నుంచి బయటపడాలంటే ఆడిట్ చేయాల్సి ఉందని, అందుకోసం ఖాతా వివరాలు చెప్పాలని మభ్యపెట్టి ఆయన ఖాతాలోని రూ.11 లక్షలు కొల్లగొట్టేశాడు. దీనిపై బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ తరహా కేసులు అనేకం నమోదవుతున్నాయి.
ఇటీవల కాలంలో ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో జరిగే మోసాలు కూడా పెరుగుతున్నాయి. అధిక లాభాలు వస్తాయంటూ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారాల ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రమోషన్ వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఆ వీడియోల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆశచూపుతున్నారు. మొదట నమ్మకం కలిగించేందుకు పెట్టుబడి పెట్టేవారికి లాభాలు వచ్చాయంటూ వారి ఖాతాలకు ఆ మొత్తాన్ని జమ చేస్తున్నారు. నిజంగానే లాభాలు వస్తున్నాయనే ఆశతో మరింత పెట్టుబడి పెడితే లాభాలు వచ్చినట్టు ఖాతాలో ఆ మొత్తం జమ అయినట్టు చూపిస్తున్నారు. అయితే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేయాలనుకుని ప్రయత్నిస్తే అప్పుడు అసలు మోసం బయటపడుతోంది. ట్రేడింగ్ ద్వారా వచ్చిన లాభాలతోపాటు తమ పెట్టుబడి కూడా తమ ఖాతాలో ఉన్నప్పటికీ విత్‌డ్రా కావడం లేదని ఎవరైనా సైబర్ నేరగాళ్లను సంప్రతిస్తే...కొన్ని ఫీజులు కట్టాల్సి ఉంటుందని చెప్పి మరికొంత డబ్బును గుంజేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు చెప్పినట్టు ఎన్నిసార్లు ఫీజుల కింద డబ్బులు చెల్లించినా సరే విత్‌డ్రా జరగకపోవడంతో చివరకు తాము మోసపోయినట్టు గుర్తిస్తున్నారు. నగరానికి చెందిన బిల్డర్ ఒకరు ఏడాది కిందట ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట ఏకంగా రూ.మూడు కోట్లకుపైగా పోగొట్టుకోగా, సైబర్‌క్రైమ్ పోలీసులు సుమారు రూ.కోటి వరకు రికవరీ చేయగలిగారు.
విశ్రాంత ఉద్యోగులు, మహిళలే టార్గెట్
కె.భవానీప్రసాద్, సైబర్‌క్రైమ్ సీఐ
విశ్రాంత ఉద్యోగులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని సైబర్‌నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఖాతాదారుల వివరాలను కొన్ని బ్యాంకులు థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా అప్‌డేట్ చేస్తుంటాయి. ఈ క్రమంలో థర్డ్ పార్టీల నుంచి సైబర్ నేరగాళ్లు ఆయా బ్యాంకు ఖాతాదారుల వివరాలతోపాటు ఎక్కువ మొత్తం ఉన్న ఖాతాలను పరిశీలిస్తారు. అందులో పెన్షన్ తీసుకుంటున్నవారిని, మహిళల ఖాతాలను గుర్తించి వారి ఫోన్ నంబర్ ఆధారంగా డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు ప్రయత్నిస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చునని ఆశతో ఉన్నవారు, వయోభారం కారణంగా చిన్నపాటి విషయానికే తీవ్రంగా స్పందించే అమాయకులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులోపడిపోతున్నారు. ఎంతగా అవగాహన కల్పిస్తున్నాసరే ప్రజల వైఖరిలో మార్పురావడం లేదు. సైబర్ నేరాలకు గురవుతున్న వారిలో విద్యావంతులే అధికంగా ఉంటున్నారు.
గత మూడేళ్లలో నమోదైన డిజిటల్ అరెస్టు, ట్రేడింగ్ మోసాల కేసులు
సంవత్సరం కేసులు పోయిన మొత్తం
2023 4 రూ.41.98 లక్షలు
2024 51 రూ.19.8 కోట్లు
2025 21 రూ.10.66 కోట్లు