వివాదస్పద భూముల్లో చెట్ల నరికివేత
ABN , Publish Date - Apr 25 , 2026 | 10:57 PM
మండలంలోని నాన్ షెడ్యూల్డ్ గరుగుబిల్లి పంచాయతీ సింగవరం గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 22లోని భూముల్లో గత రెండు రోజులుగా చెట్లు నరికివేత చర్చనీయాంశంగా మారింది.
అడ్డుకున్న సింగవరం గ్రామస్థులు
అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు
దుంగలను స్వాధీనం చేసుకున్న రేంజర్
ఈ భూములపై అటవీ, రెవెన్యూ శాఖల మధ్య కొనసాగుతున్న వివాదం
అనంతగిరి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నాన్ షెడ్యూల్డ్ గరుగుబిల్లి పంచాయతీ సింగవరం గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 22లోని భూముల్లో గత రెండు రోజులుగా చెట్లు నరికివేత చర్చనీయాంశంగా మారింది. సింగవరం రెవెన్యూ 22 సర్వే నంబర్‌లో 942 ఎకరాలు ఉన్నాయి. ఇందులోని సింగవరం, గొట్లెపాడు, పుతికవలస, పెదపుతికవలస గ్రామాల గిరిజనులు కొంత భూముల్లో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. మరికొంత భూమిని 20ఏళ్ల క్రితం మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించింది. అయితే ప్రస్తుతం ఈ భూముల విషయమై అటవీ శాఖ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం నడుస్తోంది. ఈ స్థలం తమదంటూ అటవీ శాఖ అంటుండగా.. ఇది ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ శాఖ చెబుతుండడంతో వివాదం నెలకొంది. ఈనెల ఏడవ తేదీన రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించినా ఓ కొలిక్కి రాలేదు. దీంతో వివాదం అలాగే ఉంది. ఇంతలో శుక్రవారం నుంచి అదే భూమిలోని భారీ వృక్షాలను నరికివేస్తుండడంపై స్థానికులు అడ్డుకున్నారు. ఈ విషయమై జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు సైతం అటవీ శాఖ సిబ్బంది ఆదేశాల మేరకే ప్రైవేటు వ్యక్తులు చెట్లను తరలించుకుపోయేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై రేంజర్ సుధీర్‌ను వివరణ కోరగా.. చెట్ల తొలగిస్తున్నారని సమాచారం రావడంపై వెనువెంటనే అక్కడకు వెళ్లామన్నారు. దుంగలను స్వాధీనం చేసుకుని, స్థానికుల వద్దే భద్రపరిచామన్నారు. విచారణ చేపట్టి, పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. అసలు చెట్ల తొలగింపు వెనుక ఎవరు ఉన్నారనే విషయమై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే నిజాలు బయటపడతాయని స్థానికులు కోరుతున్నారు.