Share News

ట్యాంకర్లకు కోత

ABN , Publish Date - Jul 23 , 2026 | 01:42 AM

వర్షాలు లేకపోవడంతో నగరంలో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో బోర్ల నుంచి చుక్క నీరు రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలంతా నిత్యావసరాలకు సైతం కొళాయి నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఆ ప్రభావం ట్యాంకర్లకు నీటి సరఫరాపై పడింది. గతంలో ఒక్కో ట్యాంకర్‌కు సగటున ఐదు ట్రిప్పుల వరకు ఇచ్చేవారు. ఇప్పుడు రెండు ట్రిప్పులకు మించి ఇవ్వడం లేదు. ఎండాడ, ముడసర్లోవ, డాక్టర్స్‌ కాలనీల్లోని పంప్‌హౌస్‌ల వద్ద ట్యాంకర్లకు నీటిసరఫరా పూర్తిగా నిలిపివేయడంతో టీఎస్‌ఆర్‌ రిజర్వాయర్‌పై ఒత్తిడి పెరిగిపోయింది.

ట్యాంకర్లకు కోత

కొళాయిల ద్వారా నీటి సరఫరాకు

మరింత ఇబ్బంది రాకుండా

ట్యాంకర్‌లకు కేటాయింపు తగ్గింపు

ఎండాడ, ముడసర్లోవ, డాక్టర్స్‌ కాలనీ పంప్‌హౌస్‌ల వద్ద పూర్తిగా నిలిపివేత

టీఎస్‌ఆర్‌, మాధవధార, గాజువాకల్లో మాత్రమే పంపింగ్‌

తాగునీటి కోసం అల్లాడుతున్న జనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వర్షాలు లేకపోవడంతో నగరంలో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో బోర్ల నుంచి చుక్క నీరు రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలంతా నిత్యావసరాలకు సైతం కొళాయి నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఆ ప్రభావం ట్యాంకర్లకు నీటి సరఫరాపై పడింది. గతంలో ఒక్కో ట్యాంకర్‌కు సగటున ఐదు ట్రిప్పుల వరకు ఇచ్చేవారు. ఇప్పుడు రెండు ట్రిప్పులకు మించి ఇవ్వడం లేదు. ఎండాడ, ముడసర్లోవ, డాక్టర్స్‌ కాలనీల్లోని పంప్‌హౌస్‌ల వద్ద ట్యాంకర్లకు నీటిసరఫరా పూర్తిగా నిలిపివేయడంతో టీఎస్‌ఆర్‌ రిజర్వాయర్‌పై ఒత్తిడి పెరిగిపోయింది.

నగరంలో కొళాయి ద్వారా నీటి సరఫరాకు అవకాశం లేని ప్రాంతాలతోపాటు నిత్యం సమస్య ఉండే ప్రాంతాల్లో తాగునీరు సరఫరా చేసేందుకు జీవీఎంసీ సొంతంగా ఐదు కిలోలీటర్ల నీటి ట్యాంకర్లు మూడు, ఆరు కిలోలీటర్ల ట్యాంకర్లు రెండు కొనుగోలు చేసింది. ఇంకా రెండు కిలోలీటర్ల ట్యాంకర్లు నాలుగు, ఐదు కిలోలీటర్ల ట్యాంకర్లు 22, ఆరు కిలోలీటర్లు ట్యాంకర్లు రెండు అద్దెకు తీసుకుంది. ఇవికాకుండా ప్రైవేటు వ్యక్తులు నీటిని విక్రయించుకునేందుకు వినియోగించే ఒక కిలోలీటర్‌ ఆటోలు 150, రెండు కిలోలీటర్లు వ్యాన్‌లు 97, ఆరు కిలోలీటర్లు ట్యాంకర్లు 97 ఉన్నాయి. జీవీఎంసీకి చెందిన సొంత ట్యాంకర్లతోపాటు జీవీఎంసీ అద్దెకు తీసుకున్న ట్యాంకర్లకు టీఎస్‌ఆర్‌ రిజర్వాయర్‌, ఎండాడ, పెదవాల్తేరులోని డాక్టర్స్‌ కాలనీ, ముడసర్లోవ, మాధవధార, గాజువాకలోని పంపింగ్‌ స్టేషన్లలో ఉచితంగా నీటిని నింపుతుంటారు. ఆరోజు నీటి సరఫరా జరగని ప్రాంతాలు, కొళాయి సదుపాయం లేని కొండవాలు ప్రాంతాలకు ఆ ట్యాంకర్లను పంపిస్తుంటారు. ఇక ప్రైవేటు వ్యక్తులకు చెందిన ట్యాంకర్లకు సంబంధించి జీవీఎంసీ సౌకర్యం కేంద్రాలకు వెళ్లి కమిషనర్‌ పేరున కిలోలీటర్‌కు రూ.40 చొప్పున చలానా తీసి ఆయా పంప్‌హౌస్‌ల వద్ద ఉన్న సిబ్బందికి అందజేస్తే నీటిని ఇస్తారు. ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు వాటిని డిమాండ్‌ను బట్టి దుకాణాలు, అపార్టుమెంట్‌లు, కార్యాలయాలు, హోటళ్లకు విక్రయించుకుంటారు. జీవీఎంసీకి చెందిన పంప్‌హౌస్‌ల వద్ద నిత్యం సగటున ఐదు వందల ట్యాంకర్లకు నీటిని సరఫరా చేస్తుంటారు. కిలోలీటర్‌ ఆటోలను మినహాయిస్తే మిగిలిన ట్యాంకర్లకు సగటున ఐదు ట్రిప్పుల వరకు అవకాశం ఇస్తారు. అయితే ఈ ఏడాది వేసవి ముగిసినప్పటికీ వర్షాలు కురవకపోవడంతో ట్యాంకర్లకు నీటి సరఫరా తగ్గించారు. మే నెలలో జీవీఎంసీకి చెందిన ఆరు కిలోలీటర్ల ట్యాంకర్లకు 132 ట్రిప్పులు నీరు ఇస్తే, ఈ నెల ఇప్పటివరకు 107 ట్రిప్పులు మాత్రమే ఇచ్చారు. జీవీఎంసీకి చెందిన అద్దె ట్యాంకర్లకు ఈ ఏడాది మే నెలలో 728 ట్రిప్పులు నీటిని సరఫరా చేస్తే ఈనెల ఇప్పటివరకూ 454 ట్రిప్పులు మాత్రమే ఇవ్వగలిగారు. ప్రైవేటు ట్యాంకర్లకు మే నెలలో 13,860 ట్రిప్పులు ఇస్తే, ఈనెల ఇప్పటివరకు 9,362 ట్రిప్పులు మాత్రమే ఇవ్వగలిగారు.

ట్యాంకర్లకు పంపింగ్‌ కుదింపు

వర్షాభావం కారణంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా పడిపోవడంతో నగరానికి సరఫరా తగ్గింది. దీంతో కొళాయిల ద్వారా గతంలో 45 నిమిషాల నుంచి గంట వరకు నీటిని సరఫరా చేయగా, ఇప్పుడు అరగంటకు మించి ఇవ్వడం లేదు. పైగా కొన్ని ప్రాంతాలకు రోజు విడిచిరోజు నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో నీటి సరఫరాకు మరింత ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకని ట్యాంకర్లకు కేటాయింపు కుదించేశారు. గతంలో ఎన్ని ట్రిప్పులు కావాలంటే అన్ని ట్రిప్పులు నీటిని ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఉదయం గంట నుంచి గంటన్నర, సాయంత్రం రెండు గంటలు మాత్రమే పంప్‌ల ద్వారా ట్యాంకర్లకు నీటిని ఇస్తున్నారు. ఎండాడ, డాక్టర్స్‌ కాలనీ, ముడసర్లోవ పంప్‌హౌస్‌ల వద్ద ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాలో అవకతవకలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తుండడంతో అక్కడ పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఆయా ప్రాంతాల నుంచి ట్యాంకర్లు నీటి కోసం టీఎస్‌ఆర్‌, మాధవధార పంప్‌హౌస్‌లకు వస్తున్నాయి. దీనివల్ల ట్యాంకర్లతో ఆయా ప్రాంగణాలు కిక్కిరిసిపోతున్నాయి.

Updated Date - Jul 23 , 2026 | 01:42 AM