Share News

కోటగున్నలులో కార్టెన్‌ సెర్చ్‌

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:08 PM

గిరిజన ప్రాంతంలో గంజాయి సాగుకు ఆదివాసీలు దూరంగా ఉండాలని స్థానిక ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా కోరారు. శనివారం అన్నవరం పోలీసు స్టేషన్‌ పరిధిలోని కోటగున్నలు గ్రామంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు.

కోటగున్నలులో కార్టెన్‌ సెర్చ్‌
గృహంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

ఆపరేషన్‌ ‘వజ్రప్రహార్‌’లో భాగంగా తనిఖీలు

గంజాయి సాగుకు గిరిజనులు దూరంగా

ఉండాలని ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా పిలుపు

చింతపల్లి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో గంజాయి సాగుకు ఆదివాసీలు దూరంగా ఉండాలని స్థానిక ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా కోరారు. శనివారం అన్నవరం పోలీసు స్టేషన్‌ పరిధిలోని కోటగున్నలు గ్రామంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ గంజాయితో గిరి యువత విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. పోలీసుల చర్యలతో గిరిజన ప్రాంతంలో గంజాయి సాగును పూర్తిగా నియంత్రించామన్నారు. ఒడిశా నుంచి గిరిజన ప్రాంతాల మీదుగా గంజాయి రవాణ జరుగుతుందన్నారు. గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. మూడు నెలల వ్యవధిలో 11 గంజాయి కేసులు నమోదు చేశామని, భారీ మొత్తంలో గంజాయి, ద్రవరూప గంజాయి పట్టుకున్నామన్నారు. గంజాయితో పట్టుబడితే కేసులు పెట్టడంతోపాటు ఆస్తులను జప్తు చేస్తామన్నారు. కోటగున్నలు గ్రామంలో ఉదయం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు 52 గృహాలను పోలీసులు తనిఖీ చేశారు. పది మంది పాత నేరస్తులను గుర్తించామని, వారితో జైలులో ఎదుర్కొన్న అనుభవాలను ఆదివాసీలకు వివరించామన్నారు. ఈ సందర్భంగా 30 వాహనాల రికార్డులను పరిశీలించగా.. రికార్డులు లేని 22 వాహనాలను సీజ్‌ చేశామన్నారు. ప్రజలందరూ నేరాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించామన్నారు. గంజాయి రవాణ, సాగు జరుగుతున్నట్టు గుర్తిస్తే ఈగల్‌ టోల్‌ ఫ్రీ నంబరు 1972కి కాల్‌చేయాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. అనంతరం కోటగున్నలు గ్రామంలో యువతకు వాలీబాల్‌ కిట్లు ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.వినోద్‌బాబు, ఎస్‌ఐ కె.సాయిరామ్‌, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 11:08 PM