Share News

వాతావరణానికి అనుగుణంగా సాగు

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:10 PM

గిరిజన ప్రాంత రైతులు భూతాపం వల్ల మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో రాణించాలని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌వీ జగన్నాథకుమార్‌ సూచించారు.

వాతావరణానికి అనుగుణంగా సాగు
మాట్లాడుతున్న డాక్టర్‌ ఎస్‌వీ జగన్నాథకుమార్‌

వ్యవసాయంలో గిరి రైతులు రాణించాలి

గిరిజన ప్రాంత పంటలపై ఎల్‌-నినో ప్రభావం

చిరుధాన్యాలు, రాజ్‌మా, వలిసెలు, స్వల్పకాలిన వరి రకాలపై దృష్టి సారించాలి

విశాఖపట్నం తుఫాను హెచ్చరికల వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌వీ జగన్నాథకుమార్‌

చింతపల్లి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంత రైతులు భూతాపం వల్ల మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో రాణించాలని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌వీ జగన్నాథకుమార్‌ సూచించారు. గురువారం స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి అధ్యక్షతన గిరిజన ప్రాంత పంటలపై ఎల్‌-నినో ప్రభావం- ముందస్తు చర్యలపై గిరిజన రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాథకుమార్‌ మాట్లాడుతూ ఎల్‌-నినో, లా-నినాపై వర్షాలు ఆధారపడి వుంటాయన్నారు. ఎల్‌-నినో ప్రభావాన్ని భారత వాతావరణశాఖ పరిగణనలోకి తీసుకొని ఏప్రిల్‌లో దీర్ఘకాల వర్ష సూచన విడుదల చేస్తుందన్నారు. ఈ వర్ష సూచన ఆధారంగా రైతులు వ్యవసాయంలో మార్పులు, చేర్పులు చేసుకోవడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చునన్నారు. ఈ ఏడాది భారత వాతావరణశాఖ శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఆరు నెలలు తక్కువ వర్షపాతం నమోదవుతుందని సూచించిందన్నారు. దీంతో పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అలాగే గిరిజన ప్రాంత వాతావరణంలోనూ మార్పు కనిపిస్తుందన్నారు. భూతాపం వల్ల కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తుందన్నారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంటలను ఎంపిక చేసుకుని సాగు చేసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతంలో వర్షపు నీటిని సంరక్షించుకునేందుకు తాత్కాలిక చెక్‌ డ్యామ్‌లు నిర్మించుకోవాలన్నారు. ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి మాట్లాడుతూ జిల్లాలో అత్యధికశాతం రైతులు వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారన్నారు. ఈ మేరకు వర్షాధార వరి సాగు విస్తీర్ణం తగ్గించుకోవాలన్నారు. వరిలో స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకుని మే ఆఖరిలోనే నాట్లు వేసుకోవాలని సూచించారు. ముందుగా నాట్లు వేసుకోవడం వల్ల ఆగస్టులో కోతకు వస్తుందన్నారు. అలాగే ఖరీఫ్‌లో రాగి, చిరుధాన్యాలు, ముందస్తు రబీ పంటలుగా రాజ్‌మా, వలిసెలు, రబీలో కొమ్ముశనగ, ఉలవలు సాగు చేసుకోవాలన్నారు. గిరిజన రైతులు చిరుధాన్యాలు, రాజ్‌మా, వలిసెలు పంటలపై దృష్టి సారించాలన్నారు. ఈ పంటలు సాగు చేసుకోవడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడులు పొందడంతో పాటు మంచి ఆదాయం పొందవచ్చునని తెలిపారు. రైతులకు సాగులో సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నామన్నారు. రైతులు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ముందస్తు వాతావరణ సమాచారం రైతులకు తెలియజేస్తుందన్నారు. రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ వ్యవసాయంలో ప్రగతి సాధించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త బీఎన్‌ సందీప్‌ నాయక్‌, వ్యవసాయ అధికారి టి. మధుసూదనరావు, టాటా ట్రస్టు ప్రతినిధులు, గిరిజన రైతులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 11:10 PM