Share News

కిక్కిరిసిన రైళ్లు

ABN , Publish Date - Jan 18 , 2026 | 01:24 AM

సంక్రాంతి తిరుగు ప్రయాణికులతో శనివారం విశాఖ రైల్వే స్టేషన్‌ రద్దీగా మారింది.

కిక్కిరిసిన రైళ్లు

  • తిరుగు ప్రయాణికులతో కిటకిటలాడిన స్టేషన్‌

  • ఉదయం నుంచి రాత్రి వరకూ అదే పరిస్థితి

  • సాధారణ బోగీలను తలపించిన రిజర్వేషన్‌ కోచ్‌లు

  • ప్రవేశ ద్వారాల వద్ద తొక్కిసలాట

  • ఫుట్‌బోర్డు, బాత్‌రూమ్‌ల వద్ద కూర్చుని, నిల్చొని ప్రయాణం...

విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి తిరుగు ప్రయాణికులతో శనివారం విశాఖ రైల్వే స్టేషన్‌ రద్దీగా మారింది. రైళ్లన్నీ కిక్కిరిసి నడిచాయి. ఉదయం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (20833), జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12805), సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17240)లు మొదలు రాత్రి 11.20 గంటలకు బయలుదేరే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ (18519) వరకూ తాకిడి కొనసాగింది. కేవలం సికింద్రాబాద్‌ రైళ్లకే కాకుండా చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్‌, హౌరా, విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే రైళ్లు కూడా కిటకిటలాడాయి.

రత్నాచల్‌కు పోటెత్తిన ప్రయాణికులు

దాదాపు అన్ని రైళ్లకు ఆదివారం (18న) రిగ్రెట్‌ (టికెట్‌ కూడా జారీకాని పరిస్థితి) చూపుతున్న నేపథ్యంలో సాధారణ కోచ్‌లలో కూడా ప్రయాణించలేమని భావించిన అత్యధికులు శనివారమే బయలుదేరారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లేవారు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12717) బయలుదేరే సమయానికి గంట ముందుగానే స్టేషన్‌కు చేరుకోవడంతో ఎనిమిదో నంబరు ప్లాట్‌ఫామ్‌ జనసంద్రంగా మారింది. తిరుగు ప్రయాణాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్పీఎఫ్‌, జీఆర్పీ సిబ్బంది అప్రమత్తమై రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు చేరిన తర్వాత క్యూ పద్ధతిలో కోచ్‌లోకి ప్రవేశించేలా చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కొన్ని కోచ్‌ల ప్రవేశ ద్వారాల వద్ద తోపులాట జరిగింది. పిల్లా పాపలతో ఉన్నవారు, వయసు మీదపడినవారు తొక్కిసలాటలో జనరల్‌ కోచ్‌లలోకి వెళ్లేందుకు సాహసం చేయలేక రిజర్వేషన్‌ కోచ్‌లను ఆశ్రయించారు. దీంతో రిజర్వేషన్‌ బోగీలు సైతం సాధారణ కోచ్‌లను తలపించాయి.

అన్ని రైళ్లకు రద్దీ

విశాఖ నుంచి బయలుదేరే ఒరిజినేటింగ్‌ రైళ్లు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి విశాఖ మీదుగా నడిచే రైళ్లకు తీవ్ర డిమాండ్‌ ఏర్పడి రద్దీగా మారాయి. విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లేవారు జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లనే కాకుండా తిరుమల, ప్రశాంతి, మెయిల్‌, స్వర్ణజయంతి, విశాఖ, గోదావరి, కోణార్క్‌, ఫలక్‌నూమా, ఎల్‌టీటీ వంటి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆశ్రయించారు. దీంతో జనరల్‌ కోచ్‌లు సిటీ బస్సులను తలపించాయి. అలాగే భువనేశ్వర్‌, హౌరా వైపు వెళ్లే రైళ్లకు కూడా తీవ్ర రద్దీ నెలకొంది. ముందస్తు రిజర్వేషన్‌ పొంది నిరీక్షణ జాబితాకు పరిమితమైనవారితోపాటు కొందరు జనరల్‌ టికెట్‌ ప్రయాణికులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో స్లీపర్‌ క్లాస్‌ రిజర్వేషన్‌ కోచ్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడంతో రిజర్వేషన్‌, సాధారణ కోచ్‌లకు వ్యత్యాసం లేకుండా పోయింది.

దూరప్రాంత రైళ్లలో...

విశాఖ మీదుగా భువనేశ్వర్‌, బెంగళూరు, చెన్నై, ఎర్నాకులం వెళ్లే దూర ప్రాంత రైళ్లు మరింత రద్దీగా నడిచాయి. భువనేశ్వర్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17016), ప్రశాంతి (18464), ఇంటర్‌సిటీ (22820), కోణార్క్‌ (11020)తోపాటు అటు వైపుగా హౌరా, సంత్రాగచ్చి, షాలిమార్‌, ఖరగ్‌పూర్‌, కన్యాకుమారి వంటి ప్రాంతాలకు వెళ్లే కోరమండల్‌ (12842), ఫలక్‌నూమా (12704), ఈస్ట్‌కోస్ట్‌ (18046), హిరాకుద్‌ ఎక్స్‌ప్రెస్‌ (20807), వివేక్‌ (22503), వాస్కోడిగమ-షాలిమార్‌ (18048), యశ్వంత్‌పూర్‌-హౌరా (22832), బెంగళూరు-గువహటి (12509), తిరుచనాపల్లి-హౌరా (12664), బెంగళూరు-హౌరా (12864) రైళ్లు కిక్కిరిసి నడిచాయి. ముఖ్యంగా వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌, గువహటి ఎక్స్‌ప్రెస్‌, ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల జనరల్‌ కోచ్‌లలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి కనిపించింది. ఫుట్‌ బోర్డు, బాత్‌రూమ్‌ల వద్ద కూర్చుని కొందరు, నిలబడి మరికొందరు ప్రయాణించాల్సి వచ్చింది.

Updated Date - Jan 18 , 2026 | 01:24 AM