సందర్శకుల సందడి
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:11 PM
మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో శనివారం సందర్శకుల సందడి నెలకొంది. శీతాకాలం ముగింపు నేపథ్యంలో ప్రకృతి, మంచు అందాలు ఆకర్షిస్తుండడంతో స్నేహితులు, కుటుంబాలతో కలిసి ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల సందర్శనలకు తరలి వస్తున్నారు.
మన్యం బాట పట్టిన పర్యాటకులు
కిటకిటలాడిన లంబసింగి
అరకులోయలో సందడి
పాడేరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి):
మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో శనివారం సందర్శకుల సందడి నెలకొంది. శీతాకాలం ముగింపు నేపథ్యంలో ప్రకృతి, మంచు అందాలు ఆకర్షిస్తుండడంతో స్నేహితులు, కుటుంబాలతో కలిసి ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల సందర్శనలకు తరలి వస్తున్నారు. దీంతో అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందడి నెలకొంది. బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ సన్‌రైజ్ పాయింట్, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాల కొండ, లంబసింగి ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ నెలకొంది.
చింతపల్లిలో..
ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. శనివారం లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. లంబసింగి జంక్షన్, చెరువులవేనం, భీమనాపల్లి, తాజంగి జలాశయం వద్దకు ఉదయం ఆరు గంటలకే పర్యాటకులు చేరుకున్నారు. పదకొండు గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పర్యాటకులు మంచు అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేశారు. ప్రకృతి అందాలను కెమెరాలో బంధించేందుకు పోటీ పడ్డారు. తాజంగి జలాశయం వద్ద సాహసక్రీడలు జిప్‌లైన్, బోటింగ్ చేసేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు.
అరకులోయలో
అరకులోయలో శనివారం సందర్శకులు సందడి చేశారు. సందర్శకులు ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్, సుంకరమెట్ట కాఫీతోటల మధ్య ఉడెన్‌బ్రిడ్జి, గాలికొండ వ్యూపాయింట్, మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్‌లను పర్యాటకులు సందర్శించారు. రిసార్టులు, లాడ్జీలు, టెంట్‌లు, ట్యాక్షీ, ఆటోవాలాలకు వ్యాపారం సాగింది.