Share News

భక్త జనసంద్రం

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:37 AM

కలియుగదైవం శ్రీవారి వార్షిక కల్యాణోత్సవం సందర్భంగా శుక్రవారం ఉపమాక క్షేత్రం భక్తజనసంద్రంగా మారింది. ఉమ్మడి విశాఖతోపాటు ఇరుగుపొరుగు జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం బయట, లోపల వున్న క్యూ లైన్లన్నీ కిటకిటలాడాయి. భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. గరుడాద్రి పర్వతంపై కొలువుదీరిన స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు కొండపైకి ఎక్కారు. దీంతో మెట్ల మార్గంలో రద్దీ నెలకొంది.

భక్త జనసంద్రం
ఉపమాక వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఉపమాక వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

కిటకిటలాడిన క్యూ లైన్లు

స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించిన హోం మంత్రి అనిత

సంప్రదాయబద్ధంగా ధ్వజారోహణం

కన్నుల పండువగా ఎదుర్కోలు ఉత్సవం

అర్ధరాత్రి తరువాత కల్యాణ వేడుక ఆరంభం

నక్కపల్లి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): కలియుగదైవం శ్రీవారి వార్షిక కల్యాణోత్సవం సందర్భంగా శుక్రవారం ఉపమాక క్షేత్రం భక్తజనసంద్రంగా మారింది. ఉమ్మడి విశాఖతోపాటు ఇరుగుపొరుగు జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం బయట, లోపల వున్న క్యూ లైన్లన్నీ కిటకిటలాడాయి. భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. గరుడాద్రి పర్వతంపై కొలువుదీరిన స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు కొండపైకి ఎక్కారు. దీంతో మెట్ల మార్గంలో రద్దీ నెలకొంది.

స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి అనిత

ఉపమాక వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి అయిన వంగలపూడి అనిత శుక్రవారం ఉదయం ఆలయానికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఉభయ దేవేరులతో స్వర్ణాభరణాలతో అలంకరించిన స్వామివారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనిత గోత్రనామాలతో ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి శేషవస్ర్తాన్ని, చిత్రపటాన్ని బహూకరించారు. ఉత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లపై భక్తులను ఆరా తీశారు. మహిళల కోలాటం, బాలికల కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి, కళాకారులను సత్కరించారు.

సంప్రదాయబద్ధంగా ధ్వజారోహణం

శ్రీవారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ధ్వజారోహణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తొలుత అర్చకులు ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేసి, గరుడ పతాకాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేశారు. అంతకుముందు ఉభయదేవేరులతో స్వర్ణాభరణాల అలంకృతుడైన స్వామివారిని పెద్దపల్లకీలో మాఢవీధుల్లో ఊరేగించారు. ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు, అర్చకులు కృష్ణమాచార్యులు,శేషాచార్యులు, నండూరి రాజగోపాలాచార్యులు, పవన్‌, జ్ఞాన ప్రమోద్‌ తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

కన్నుల పండువగా ఎదుర్కోలు ఉత్సవం

శుక్రవారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. ఇత్తడి గరుడ వాహనంపై కల్యాణ వేంకటేశ్వరస్వామిని, శేష తల్పం వాహనంపై శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఆశీనులను చేసి మాఢవీధుల్లో ఊరేగించారు. పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం సింహాద్రిమాస్టారు ఇంటి వద్ద ఇరు వాహనాలను ఎదురెదురుగా వుంచారు. వేదపండితురాలు గాయత్రీదేవి పెండ్లి చూపులు, పెండ్లి మాటల ఘట్టాన్ని వివరించారు. మంత్రి అనిత, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తరువాత అర్ధరాత్రి 12 గంటలకు రథోత్సవం నిర్వహించారు. తరువాత కల్యాణ వేడుకలు మొదలయ్యాయి.

తిరుమల లడ్డూ ప్రసాదాల విక్రయం

ఉపమాక క్షేత్రంలో తిరుమల లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రాన్ని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, టీడీపీ నియోజకవర్గం కన్వీనర్‌ కొప్పిశెట్టి వెంకటేశ్‌, పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జి కొప్పిశెట్టి బుజ్జి, ఆలయ ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు ప్రారంభించారు. తిరుమల నుంచి 15 వేల లడ్డూలను తీసుకురాగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి దాదాపు 10 వేల లడ్డూలను భక్తులు కొనుగోలు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు.

ఉపమాక వెంకన్న కల్యాణోత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరవుతుండడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు మురళీ, అప్పన్న, రామకృష్ణ, దేవుళ్లు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. క్యూలైన్లలో వున్న వారికి మంచినీరు, మజ్జిగ పంపిణీ చేశారు.

Updated Date - Feb 28 , 2026 | 12:37 AM