భక్తజన సంద్రం
ABN , Publish Date - Feb 02 , 2026 | 01:05 AM
ఘనంగా మాఘ పౌర్ణమి జాతర
ఘనంగా మాఘ పౌర్ణమి జాతర
సముద్రంలో పుణ్యస్నానాలకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు
కిక్కిరిసిన పూడిమడక, రేవుపోలవరం, ముత్యాలమ్మపాలెం తీర ప్రాంతాలు
భారీ ఎత్తున పోలీసు బందోబస్తు
ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ అధికారులు
మాఘ పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని రేవుపోలవరం, పూడిమడక, ముత్యాలమ్మపాలెం, వాడపాలెం, బోయపాడు, పెంటకోట తదితర సముద్ర తీర ప్రాంతాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శనివారం రాత్రంతా జాగారం చేసి ఆదివారం తెల్లవారుజాము నుంచి సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించడం మొదలుపెట్టారు. అనంతరం సమీపంలో వున్న ఆలయాలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సాగర తీరంలో గజ ఈతగాళ్లను నియమించి, డోన్ కెమెరాలతో పర్యవేక్షించారు. పూడిమడక, రేవుపోలవరం, ముత్యాలమ్మపాలెం ప్రాంతాలకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపారు.
అచ్యుతాపురం: మండలంలోని పూడిమడకలో శనివారం రాత్రి జాతర జరిగింది. తీరంలో పలు సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ఆదివారం ఉదయం సముద్ర స్నానాలు ఆచరించిన అనంతరం జగన్నాథస్వామిని దర్శించుకున్నారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో పూడిమడక ప్రధాన రహదారి రద్దీగా మారింది. ఒక దశలో రెండు కిలోమీటర్ల దూరం నడవడానికి సుమారు 45 నిమిషాలు పట్టింది. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉచితంగా మంచినీరు, మజ్జిగ, పులిహోర పంపిణీ చేశారు.
ఎస్.రాయవరం: మండలంలోని రేవుపోలవరం సముద్రతీరం వద్ద శని, ఆదివారాల్లో లక్ష్మీ మాధవస్వామి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక్కడ సాగర తీరంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తీరం మొత్తం జనసంద్రంగా మారింది. అనంతరం గుట్టపై వున్న లక్ష్మీ మాధవస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అడ్డరోడ్డు జంక్షన్ నుంచి రేవుపోలవరం వరకు వాహనాల రద్దీ అధికంగా వుండడంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది.