ఆరుతడి పంటలు మేలు
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:27 AM
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు ఆరు తడి పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎం.ఆశాదేవి సూచించారు.
రైతులకు జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి సూచన
నక్కపల్లి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు ఆరు తడి పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎం.ఆశాదేవి సూచించారు. ఆమె మంగళవారం మండలంలోని ఉద్దండపురం, గొడిచెర్ల, దేవవరం గ్రామాల్లో పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా వరినాట్లు వేస్తున్న రైతులతో మాట్లాడి, వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో సగానికిపైగా లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. ఈ నేపథ్యంలో గత వారంలో కురిసిన భారీ వర్షాలు రైతులకు ఎంతో ఊరటనిచ్చాయని, అయితే వరి సాగుకు అదను దాటిపోయినందున నీటి వసతి లే భూముల్లో రాగి, మినుము, పెసర, జనుము, ఉలవ వంటి స్వల్పకాలిక ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. ఏవో ఉమాప్రసాద్ మాట్లాడుతూ, నక్కపల్లి మండలంలో వరి సాధారణ విస్తీర్ణం 4,450 ఎకరాలుకాగా, ఇప్పటి వరకు 825 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేసినట్టు కలెక్టర్‌కు వివరించారు.