క్రిటికల్ కేర్ బ్లాక్‌కు గ్రహణం
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:43 AM
కేజీహెచ్‌లో సుమారు రూ.23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్‌లో సేవలు ఇంకా ప్రారంభం కాలేదు.
రోగులకు అందని సేవలు
పదేపదే ప్రారంభోత్సవం వాయిదా
పూర్తిస్థాయి పరికరాలు రాకపోవడమే కారణం
ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కేంద్రం మంజూరు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కేజీహెచ్‌లో సుమారు రూ.23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్‌లో సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పటికప్పుడు అధికారులు సన్నాహాలు చేస్తున్నా, వివిధ కారణాలతో వాయిదా పడుతోంది. గత ఏప్రిల్‌లో ప్రారంభించాలని అధికారులు తొలుత భావించారు. అనివార్య కారణాలతో వాయిదా పడింది. కాగా ఈ నెల 9న వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో ప్రారంభించేందుకు ఏర్పాట్లుచేశారు. కానీ మళ్లీ వాయిదా పడింది.
అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా దేశవ్యాప్తంగా అనేక మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ బ్లాక్‌లను మంజూరుచేసింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర మెడికల్ కళాశాల పరిధిలోని కేజీహెచ్‌కు రూ.23.75 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ఐదు అంతస్థులతో కేజీహెచ్‌లో మార్చురీ ఎదురుగా బ్లాక్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ మొత్తంలో రూ.7.5 కోట్లను అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకు వెచ్చించాలని కేంద్రం సూచించింది. మొత్తం 400 రకాల పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 150 పరికరాలు వచ్చాయి. మిగిలిన పరికరాలు రాకపోవడంతో సెంటర్ ప్రారంభోత్సవంలో తాతారం జరుగుతోందంటున్నారు. ఆ పరికరాలను రాష్ట్రస్థాయిలోనే కొనుగోలు చేసి పంపించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.
50 పడకలతో వైద్య సేవలు
ఈ బ్లాక్‌లో 50 పడకలు ఉంటాయి. వీటిలో ఒక్కో విభాగానికి రెండు నుంచి పది పడకలను కేటాయించారు. ప్రధానంగా అత్యవసర కేసులు అధికంగా వచ్చేందుకు అవకాశం ఉన్న ఎమర్జన్సీ డిపార్టుమెంట్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్స్, గైనిక్ విభాగాలకు పడకలను కేటాయించారు. ఈ బ్లాక్‌లో వైద్య సేవలు అం దించేందుకు సుమారు 60 మంది నర్శింగ్ సిబ్బంది అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ సెంటర్ ద్వారా అత్యవసర వైద్య సేవలను ఒకేచోట అందిం చనున్నారు. 24 గంటలూ నిపుణులైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు.