Share News

కేజీహెచ్‌లో క్రిటికల్‌ కేర్‌

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:17 AM

అత్యవసర పరిస్థితుల్లో కేజీహెచ్‌కు వచ్చే రోగులకు ఇకపై మెరుగైన సేవలు అందనున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా అనేక మెడికల్‌ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లను మంజూరుచేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర మెడికల్‌ కళాశాల పరిధిలో గల కేజీహెచ్‌కు రూ.23.75 కోట్లు కేటాయించింది.

కేజీహెచ్‌లో క్రిటికల్‌ కేర్‌
: సిద్ధమైన క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ భవనం

అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం

ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా

రూ.23.75 కోట్లు కేటాయించిన కేంద్రం

మార్చురీ ఎదురుగా ఐదు అంతస్థులతో బ్లాక్‌ నిర్మాణం

50 బెడ్స్‌ ఏర్పాటు

వచ్చే నెలలో అందుబాటులోకి...

రూ.7.12 కోట్లతో అత్యాధునిక పరికరాలు కొనుగోలు

విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి):

అత్యవసర పరిస్థితుల్లో కేజీహెచ్‌కు వచ్చే రోగులకు ఇకపై మెరుగైన సేవలు అందనున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా అనేక మెడికల్‌ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లను మంజూరుచేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర మెడికల్‌ కళాశాల పరిధిలో గల కేజీహెచ్‌కు రూ.23.75 కోట్లు కేటాయించింది. ఆ మొత్తంలో రూ.7.12 కోట్లు అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకు వెచ్చించాలని సూచించింది. కేజీహెచ్‌లో మార్చురీ ఎదుట కొద్ది నెలల కిందట ప్రారంభమైన భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రి అధికారులు పరికరాలు కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారు. ఏప్రిల్‌ రెండో వారం నాటికి బ్లాక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి తెలిపారు.

50 పడకలతో బ్లాక్‌

ఈ బ్లాక్‌లో 50 బెడ్స్‌ అందుబాటులో ఉంటాయి. ఒక్కో విభాగానికి రెండు నుంచి పది చొప్పున కేటాయించారు. అత్యవసర కేసులు అధికంగా వచ్చేందుకు అవకాశం ఉన్న ఎమర్జన్సీ డిపార్టుమెంట్‌, జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్స్‌, గైనిక్‌ వంటి విభాగాలకు బెడ్స్‌ కేటాయిస్తున్నారు. సుమారు 60 మంది నర్సింగ్‌ సిబ్బంది అవసరమవుతారని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో నర్సింగ్‌ సిబ్బంది కొరత ఉన్న దృష్ట్యా ఈ బ్లాక్‌కు కొత్తవారిని తీసుకోవాలని ఇప్పటికే ఆస్పత్రి అధికారులు కోరారు.

ఒకేచోట వైద్యం అందేలా..

ప్రస్తుతం ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో చేరే రోగులకు క్యాజువాల్టీ, ఎమర్జన్సీ మెడిసిన్‌ విభాగాల్లో వైద్యం అందిస్తున్నారు. పరిస్థితులను బట్టి ఆయా విభాగాలకు తరలిస్తున్నారు. ఈ బ్లాక్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ విభాగానికి చెందిన వారైన అత్యవసర స్థితిలో ఉంటే ఇక్కడే చేర్చి వైద్యం అందించనున్నారు. 24 గంటలు నిపుణులైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు.

అత్యాధునిక పరికరాలు

రోడ్డు ప్రమాదాలు, బ్రెయిన్‌, హార్ట్‌ స్ర్టోక్‌ బాధితులకు, పాముకాటు, శ్వాసకోశ సంబంధ సమస్యలు, తీవ్రమైన గాయాలైన వారికి ఇక్కడ వైద్య సేవలు అందించనున్నారు. ఈ బ్లాక్‌లో సేవల నిమిత్తం అత్యాధునిక వెంటిలేటర్లు, ఇతర ఐసీయూ పరికరాలు, పరీక్షలు నిర్వహించే మెషీన్లు కొనుగోలు చేయనున్నారు. ఇక్కడి నుంచి మరోచోటకు రోగిని తరలించాల్సిన అవసరం లేకుండా అన్ని పరీక్షలను నిర్వహించేలా ఈ విభాగాన్ని తీర్చిదిద్దనున్నారు. ఆస్పత్రిలో మరో కీలకమైన కేంద్రంగా క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ నిలుస్తుందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణి తెలిపారు. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చేతులమీదుగా ప్రారంభించే ఆలోచనలో ఉన్నామన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 01:17 AM