గిరి విద్యార్థుల మృతికి బాధ్యులపై క్రిమినల్ చర్యలు
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:18 PM
గిరిజన విద్యార్థుల మృతికి కారకులైన వారిపై క్రిమినల్ చర్యలు చేపడతామని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు.
ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలని హితవు
అత్యవసర అంబులెన్స్‌కు 6303921374 కాల్ చేయాలి
పాడేరు, జనవరి 17(ఆంధ్రజ్యోతి):
గిరిజన విద్యార్థుల మృతికి కారకులైన వారిపై క్రిమినల్ చర్యలు చేపడతామని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. ఇటీవల కాలంలో గిరిజన విద్యార్థుల మరణాలు, అంబులెన్స్‌ల కోసం గిరిజనులు పడుతున్న అవస్థల నేపథ్యంలో శనివారం ఆమె విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీవో శ్రీపూజ మాట్లాడుతూ ఎక్కడైనా గిరిజన విద్యార్థులు మృతి చెందితే అందుకు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. తాజాగా పెదబయలు మండలం సీకరి పంచాయతీ కౌరుపల్లికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని కొర్రా పూజిత మృతి ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. స్వగ్రామంలో ఉన్న పూజితకు అనారోగ్య సమస్య నెలకొంటే తక్షణమే ఆస్పత్రికి కాకుండా వేరేచోట ప్రైవేటుగా వైద్యం చేయించారని, ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో హడావిడిగా ఆస్పత్రి తరలించారన్నారు. ఆస్పత్రిలో వైద్య సేవలు అందించినప్పటికీ ఫలితం దక్కలేదన్నారు. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తం కావాలన్నారు. పాఠశాలల్లోని విద్యార్థులకు ఎటువంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా తక్షణమే సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించాలని, అందుకు తల్లిదండ్రులు సైతం సహకరించాలన్నారు. స్వగ్రామాలకు విద్యార్థులు వెళుతున్నప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ లేదా అనధికార వైద్యం చేయిస్తున్నారని, అటువంటివి ప్రోత్సహించవద్దని ఆమె హితవు పలికారు. పల్లెల్లో రోగులకు తప్పుడు వైద్యం చేస్తూ ప్రాణాలు కోల్పోయేందుకు అవకాశం కల్పిస్తున్న వారిపై నిఘా పెట్టామని, క్రిమినల్ చర్యలు చేపడతామన్నారు. అటువంటి వ్యక్తులను ఆశ్రయించి తమ ప్రాణాలు కోల్పోవద్దని గిరిజనులను ఐటీడీఏ పీవో శ్రీపూజ కోరారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు, సిబ్బంది ఉన్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అత్యవసర అంబులెన్స్‌కు 6303921374 కాల్ చేయాలి
గిరిజన రోగులు అత్యవసర అంబులెన్స్ కోసం 6303921374 నంబరుకు కాల్ చేయాలని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ సూచించారు. అంబులెన్స్ సేవలను మరింత పటిష్టం చేశామని, తొలుత 108 కాల్ చేయాలని, తక్షణమే అందుబాటులో లేకుంటే వెంటనే అత్యవసర అంబులెన్స్ సేవల కోసం 6303921374 నంబరుకు కాల్ చేయాలన్నారు. ఆయా సేవలను వినియోగించుకోవడంపై ప్రజలు అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.హేమలతదేవి, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ టీఎన్.ప్రతాప్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ పాల్గొన్నారు.