త గ్గిన నేరాలు
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:20 AM
నగరంలో నేరాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
సైబర్ కేసులు 29.51 శాతం, కొట్లాట కేసులు 15 శాతం తగ్గుదల
గణనీయంగా తగ్గిన చోరీలు
రోడ్డు ప్రమాదాల సంఖ్య స్వల్పంగా తగ్గుదల
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో నేరాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న సమీక్షలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గత మూడేళ్లుగా అన్ని రకాల కేసుల సంఖ్య తగ్గుతోంది.
నగరంలోని అన్ని స్టేషన్లలో వివిధ విభాగాలకు సంబంధించి 2024లో జనవరి నుంచి అక్టోబరు వరకు 6,994 కేసులు నమోదైతే, 2025 జనవరి నంచి అక్టోబరు నాటికి 6,739కు, ఈ ఏడాది అక్టోబరు నాటికి 6,267కు తగ్గాయి. వివిధ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో కూడా స్వల్పంగా వృద్ధి సాధించారు. 2024లో అక్టోబరు వరకు 526 మందికి శిక్షలు పడితే 2025లో 920 మందికి, ఈ ఏడాది అక్టోబరు నాటికి 938 మందికి శిక్షలు పడేలా చేయగలిగారు. సొత్తుకోసం హత్యలు, దోపిడీలు, దారిదోపిడీలు, పగటిపూట, రాత్రిపూట చోరీలు, స్నాచింగ్ వంటి కేసులు 2024లో జనవరి అక్టోబరు నాటికి 933 నమోదైతే, 2025లో అక్టోబరు నాటికి 1,003 పెరగ్గా, ఈ ఏడాది 854కు తగ్గాయి. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం, దాడులు, కిడ్నాప్‌లు, గాయపరచడం, హత్యాయత్నాలు వంటి కేసులు 2024లో 553 నమోదైతే, 2025 నాటికి 544కి, ఈ ఏడాది 465కి తగ్గాయి. మహిళలపై దాడులు, వేధింపులు కేసులు తగ్గుముఖం పట్టాయి. 2024లో అక్టోబరు నాటికి 947 కేసులు నమోదైతే, 2025 అక్టోబరు నాటికి 808, ఈ ఏడాది 698కి తగ్గాయి. ఇంకా చిన్నారులు, మైనర్లపై దాడులు, లైంగిక వేధింపులకు సంబంధించి 2024లో జనవరి నుంచి అక్టోబరు నాటికి 111 కేసులు నమోదైతే, గత ఏడాది అక్టోబరు నాటికి 74, ఈ ఏడాది అక్టోబరు నాటికి 53కి తగ్గాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు పెరిగినప్పటికీ, ప్రమాదాలను తగ్గించడంలో సఫలీకృతులయ్యారు. 2024లో అక్టోబరు నాటికి 903 ప్రమాదాలు జరిగితే, 2025లో అక్టోబరు నాటికి 925, ఈ ఏడాది అక్టోబరు నాటికి 894కి తగ్గాయి. ఈ విషయంలో పోలీసులు మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులు కూడా గణనీయంగా తగ్గాయి. 2024 జనవరి నుంచి అక్టోబరు నాటికి 632 కేసులు, 2025 అక్టోబరు నాటికి 545 కేసులు నమోదైతే ఈ ఏడాది 429కి పరిమితం కావడం విశేషం. సైబర్ మోసాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచడంతో కేసులు తగ్గుముఖం పట్టాయి. 2024లో అక్టోబరు నాటికి 325 కేసులు, గత ఏడాది అక్టోబరు నాటికి 244 కేసులు నమోదైతే ఈ ఏడాది అక్టోబరు నాటికి 172కి తగ్గాయి.
ప్రశాంతత కాపాడడమే లక్ష్యం
సీపీ శంఖబ్రతబాగ్చి
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళలకు భద్రత, ప్రజలు స్వేచ్ఛగా జీవనం సాగించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోంది. ఇందుకోసం డీసీపీ, ఏడీసీపీ స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, అవసరమైన ప్రణాళికలు రచించి క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలుచేస్తున్నాం. అధికారులు, సిబ్బంది నిరంతరం కృషిచేయడంతోపాటు దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంతో అన్ని రకాల కేసులను తగ్గించగలిగాం.
కేసులు గత మూడేళ్లలో జనవరి నుంచి అక్టోబరువరకు నమోదైన నేరాలు, కేసులు వివరాలు
2024 2025 2026 తగ్గిన శాతం
సొత్తు చోరీ 933 1003 854 14.85
కొట్లాటలు 553 544 464 15
మహిళలపై దాడులు 947 808 698 14
పోక్సో కేసులు 111 74 53 28
రోడ్డు ప్రమాదాలు 903 925 894 3.35
ఆర్థిక నేరాలు 632 545 429 21
సైబర్ నేరాలు 325 244 172 29.51