ట్రాఫిక్ ఉల్లంఘనులకు చెక్
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:48 AM
నగరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూసేందుకు, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రద్దీ ప్రాంతాల్లో స్పీడ్ లేజర్ గన్లు ఏర్పాటు చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు.
రద్దీ ప్రాంతాల్లో స్పీడ్ లేజర్ గన్‌ల ఏర్పాటు
రియల్ టైమ్‌లో ఇ-చలాన్‌లు జారీ
సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి వెల్లడి
మహారాణిపేట, మార్చి 27 (ఆంధ్రజ్యోతి):
నగరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూసేందుకు, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రద్దీ ప్రాంతాల్లో స్పీడ్ లేజర్ గన్లు ఏర్పాటు చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సీఎస్‌ఆర్ నిధులు సుమారు రూ.18 లక్షలతో సమకూర్చిన రెండు స్పీడ్ లేజర్ గన్లను జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ శుక్రవారం పోలీస్ కమిషనరేట్‌లో కమిషనర్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు, వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి ఈ స్పీడ్ లేజర్‌గన్లు ఉపకరిస్తాయన్నారు. అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడిపినా, హెల్మెట్ లేకపోయినా, వాహనంపై ముగ్గురు ప్రయాణించినా, వ్యతిరేక దిశ (రాంగ్ రూట్)లో వెళ్లినా, ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా ఈ స్పీడ్ లేజర్ గన్లు 100 మీటర్ల దూరంలోనే పసిగడతాయన్నారు. ఆటోమేటిగ్గా వారికి ఇ-చలాన్ జారీ అవుతుందన్నారు. ఈ గన్‌ల సాయంతో నగరంలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత మెరుగ్గా క్రమబద్ధీకరించవచ్చునని సీపీ అభిప్రాయపడ్డారు. త్వరలో మరో స్పీడ్ లేజర్ గన్‌ను సౌత్ ఏషియన్ ఎల్‌పీజీ వారు సమకూర్చనున్నారని తెలిపారు. ఈ మూడింటిని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ ఐసీ) ద్వారా అనుసంధానం చేసి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడే వాహనదారులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రియల్ టైమ్‌లో చలానాలు జారీచేస్తామన్నారు.
గ్యాస్ డెలివరీ బాయ్‌ల మాయాజాలం
50 సిలిండర్లతో ఓ డెలివరీ బాయ్ పరారీ
సిలిండర్ ఇంటికి తీసుకొచ్చేంత వరకూ ఓటీపీ చెప్పొద్దంటున్న అధికారులు
విశాఖపట్నం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి):
అమెరికా/ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా వంట గ్యాస్‌కు డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో డెలివరీ బాయ్‌లు చేతివాటం చూపిస్తున్నారు. వినియోగదారులకు ఇవ్వాల్సిన సిలిండర్లను కొంతమంది బయట రూ.3 వేలు చొప్పున అమ్ముకుంటున్నారు. పౌర సరఫరాల శాఖాధికారులు ఎప్పుడు దాడులు చేసినా ఇలాంటి సిలిండర్లు 20కి తక్కువ కాకుండా దొరుకుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ద్వారకా నగర్‌లోని ఒక గ్యాస్ ఏజెన్సీకి చెందిన ఒక డెలివరీ బాయ్ వినియోగదారులకు చెందిన 50 సిలిండర్లతో పరారైపోయాడని విశ్వసనీయంగా తెలిసింది. ఆ బాయ్ వినియోగదారులతో మంచిగా ఉంటూ ఓటీపీ ముందే తీసుకొని సిలిండర్ ఆ తరువాత డెలివరీ చేసేవాడు. నమ్మకంగా ఉంటున్నాడని అంతా విశ్వసించారు. ఓటీపీలు ముందే చెప్పేవారు. దానిని అలుసుగా తీసుకొని దాదాపుగా 50 మందికి చెందిన సిలిండర్లు డెలివరీ తీసుకొని పరారైపోయాడు. సదరు వినియోగదారులు ఎన్నిసార్లు ఫోన్ చేసి సమాధానం ఇవ్వకపోవడంతో ఏజెన్సీకి వెళ్లారు. అక్కడ కూడా లేకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించారు. కొద్దిరోజులుగా రావడం లేదని చెప్పడంతో తమ సిలిండర్లు ఇవ్వలేదని వారు ఫిర్యాదు చేశారు. ఇలా చాలామంది రావడంతో ఆ బాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
డోర్ డెలివరీ తగ్గించేశారు
ఇప్పుడు సిలిండర్ బుక్ చేసిన 20 రోజులకు గానీ రావడం లేదు. బుక్ చేసిన తరువాత పది రోజుల నుంచే రోజూ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ఎంక్వయిరీ చేయాల్సి వస్తోంది. ఓటీపీలు వచ్చినా సిలిండర్ డెలివరీ ఇవ్వడం లేదు. ఆఫీసుకే రమ్మంటున్నారు. అక్కడకు వెళితే బాయ్ లేడని, మీరే తీసుకువెళ్లాలని చెబుతున్నారు. దాంతో ఎవరి సిలిండర్ వారే సొంత వాహనాలపై తీసుకువెళ్లాల్సి వస్తోంది. వాస్తవానికి సిలిండర్‌కు ఇచ్చే బిల్లులో డెలివరీ చార్జీ కింద రూ.30 వసూలు చేస్తున్నారు. ఆపీసు లేదా గొడౌన్‌లో తీసుకుంటే ఆ మేరకు ఆ రూ.30 మినహాయించి బిల్లు తీసుకోవాలి. కానీ పూర్తి మొత్తం డీలర్లు వసూలు చేస్తున్నారు.
ఓటీపీలు చెప్పవద్దు
భాస్కర్, డీఎస్‌ఓ
గ్యాస్ సిలిండర్ ఇంటికి తీసుకువచ్చినప్పుడే డెలివరీ బాయ్‌కు ఓటీపీ చెప్పాలి. ముందుగా చెప్పవద్దు. అలా చేస్తే ఆ సిలిండర్ వేరే వారికి ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరినీ నమ్మడానికి అవకాశం లేదు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి.
ఎండ మొదలైంది
ఎయిర్‌పోర్టులో 35.8 డిగ్రీలు నమోదు
విశాఖపట్నం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి):
నగరంలో శుక్రవారం ఎండ తీవ్రత కొనసాగింది. ఉదయం పది గంటల వరకు పాక్షికంగా మేఘాలు ఆవరించి, చల్లని గాలులు వీచినా...ఆ తరువాత ఎండ మొదలైంది. మధ్యాహ్న సమయంలో వేడి వాతావరణం నెలకొంది. కొన్నిచోట్ల వేడిగాలులు వీచాయి. దీంతో ప్రధాన రహదారులపై జనసంచారం తగ్గింది. ఎయిర్‌పోర్టులో 35.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. శని, ఆదివారాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని, ఆ తరువాత క్రమేపీ పెరుగుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.
ఉమ్మడి జిల్లాకు కొత్తగా 14 కోర్టులు
విశాఖకు 7, గాజువాకకు 3,
నర్సీపట్నానికి 2, భీమిలి, ఎలమంచిలికి చెరొకటి మంజూరు
విశాఖపట్నం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి):
న్యాయ వివాదాలు సత్వర పరిష్కారానికి ఉపయోగపడేలా జిల్లాలకు కొత్త కోర్టులు, అదనపు కోర్టులు మంజూరుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అందులో ఉమ్మడి విశాఖ జిల్లాకు విభాగాల వారీగా మొత్తం 14 కోర్టులు మంజూరయ్యాయి. జిల్లా జడ్జి కేడర్ ఆరు, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కేడర్‌లో ఐదు, సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కేడర్‌లో రెండు కోర్టులు మంజూరయ్యాయి. వాటిలో విశాఖపట్నం జిల్లాకు ఏడు, గాజువాకకు మూడు, నర్సీపట్నానికి రెండు, భీమిలికి ఒకటి, ఎలమంచిలిలో మరొకటి ఏర్పాటు కానున్నాయి.
జిల్లా జడ్జి కేడర్‌లో
- విశాఖలో 14వ అదనపు జిల్లా అండ్ సెషన్స్ జడ్జి, 15వ అదనపు జిల్లా అండ్ సెషన్స్ జడ్జి, 2వ అదనపు ఫ్యామిలీ కోర్టు-కమ్-అదనపు జిల్లా అండ్ సెషన్స్ కోర్టు, అదేవిధంగా మూడో అదనపు ఫ్యామిలీ కోర్టు, గాజువాకలో ఫ్యామిలీ కోర్టు-కమ్-అదనపు జిల్లా అండ్ సెషన్స్ కోర్టు, నర్సీపట్నంలో అదనపు జిల్లా అండ్ సెషన్స్ జడ్జి కోర్టు ఏర్పాటుకానున్నాయి.
సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కేడర్‌లో-విశాఖపట్నానికి ఐదవ, ఆరవ, ఏడవ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్టే్ట్రట్-కమ్-అదనపు సివిల్ జడ్జి కోర్టులు మంజూరుచేశారు. గాజువాకకు రెండవ, మూడవ అదనపు సివిల్ జడ్జి-కమ్-అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్టే్ట్రట్ కోర్టు ఇచ్చారు. భీమునిపట్నానికి సివిల్ జడ్జి కోర్టు మంజూరైంది.
సివిల్ జడ్జి జూనియర్ విభాగంలో
- ఎలమంచిలి, నర్సీపట్నాలకు రెండవ అదనపు సివిల్ జడ్జి-కమ్-జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులు మంజూరయ్యాయి.