రెస్టో బార్‌లపై సీరియస్
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:24 AM
భీమునిపట్నం బీచ్‌రోడ్డులో సీజ్ చేసిన రెస్టోబార్‌లను అనుమతులు లేకుండా తిరిగి ఎలా తెరుస్తారని హైకోర్టు ప్రశ్నించింది. వారిపై ఏమి చర్యలు తీసుకుంటున్నారని జీవీఎంసీ అధికారులను ప్రశ్నించింది. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన, నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై విచారణకు ఆదేశిస్తామని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన రెస్టోబార్ యజమానులను సైతం ఉపేక్షించేది లేదని పేర్కొంది.
సీజ్ చేసిన వాటిని
అనుమతులు లేకుండా ఎలా తెరుస్తారు?
హైకోర్టు నిలదీత
వారిపై ఏమి చర్యలు తీసుకుంటున్నారు
జీవీఎంసీ అధికారులకు సూటి ప్రశ్న
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న
అధికారులపై విచారణకు ఆదేశిస్తామని హెచ్చరిక
నిబంధనలు ఉల్లంఘించిన
యజమానులను కూడా ఉపేక్షించేది లేదని వెల్లడి
అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):
భీమునిపట్నం బీచ్‌రోడ్డులో సీజ్ చేసిన రెస్టోబార్‌లను అనుమతులు లేకుండా తిరిగి ఎలా తెరుస్తారని హైకోర్టు ప్రశ్నించింది. వారిపై ఏమి చర్యలు తీసుకుంటున్నారని జీవీఎంసీ అధికారులను ప్రశ్నించింది. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన, నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై విచారణకు ఆదేశిస్తామని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన రెస్టోబార్ యజమానులను సైతం ఉపేక్షించేది లేదని పేర్కొంది. ఓ వైపు కార్యకలాపాలు నిర్వహిస్తూ...అటువంటిదేమీ లేదని కోర్టును తప్పుదోవ పట్టించడంపై అసహనం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించనీయవద్దని జీవీఎంసీ అధికారులకు స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.
భీమునిపట్నం రెవెన్యూ పరిధిలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపి, కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీహార్స్ రెస్టోబార్ (బీజాగ్), విరాగో నియోఏజ్ పబ్, తీరం బీచ్ రిసార్ట్, శాంక్టమ్ బార్ అండ్ రెస్టారెంట్‌లపై తక్షణం చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ గ్రామ అభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు గంటా నూకరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తీర ప్రాంత పర్యావరణాన్ని పునరుద్ధరించేందుకు ప్రణాళిక రూపొందించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. మరోవైపు భీమునిపట్నం మండలం నిడిగట్టు గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అధికార పరిధి లేకుండా కట్టడాల కూల్చివేతకు జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారని, తమ కట్టడాల విషయంలో జోక్యం చేసుకోకుండా నిలువురించాలని కోరుతూ పలువురు రెస్టోబార్ యజమానులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది.
నూకరాజు తరపున న్యాయవాది ఎన్.జోయ్ వాదనలు వినిపిస్తూ....రెస్టోబార్లలో కార్యకలా పాలు జరగడం లేదని కోర్టును తప్పుదోవ పట్టించారన్నారు. సీహార్స్ రెస్టోబార్ (బీజాగ్), విరాగో నియోఏజ్ పబ్, తీరం బీచ్ రిసార్ట్ యథావిధిగా నడుస్తున్నాయన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) వాదనలు వినిపిస్తూ సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించి కార్యకలాపాలను నిర్వహిస్తున్న రెస్టోబార్లను గతంలో సీజ్ చేశామన్నారు. అయితే శాంక్టమ్ బార్ అండ్ రెస్టారెంట్ మినహా అన్ని రెస్టోబార్లు కార్యకలాపాలు ప్రారంభించినట్టు అధికారులు సమాచారం ఇచ్చారన్నారు. విరాగో పబ్ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైందని, సీజ్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
సీహార్స్ రెస్టోబార్ తరఫు న్యాయవాది స్పందిస్తూ...‘తాము తాత్కాలిక నిర్మాణంలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నామన్నారు. పిటిషనర్ ఆరోపిస్తున్నట్టు బార్ నడపడం లేదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ...‘కార్యకలాపాలు జరగడం లేదని గత విచారణలో చెప్పారు. కోర్టును ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు. న్యాయవాదులు నిష్పాక్షికంగా ఉంటారని భావిస్తాం. ఇలాంటి చర్యలను ఆమోదించలేం’. అని పేర్కొంది. అనుమతులు లేకుండా రెస్టోబార్లు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.