Share News

దూర విద్య పరీక్షల్లో అక్రమాలపై కొరడా

ABN , Publish Date - Nov 22 , 2026 | 01:19 AM

దూర విద్య పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన కళాశాలలు, విద్యార్థులపై ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు కొరడా ఝళిపించారు.

దూర విద్య పరీక్షల్లో అక్రమాలపై కొరడా

  • గజపతినగరం ‘సాయి సిద్ధార్థ’, కోటనందూరు ‘మదర్‌’, చోడవరం ‘ఉషోదయ’, మంగళగిరి ‘వీజేపీ డీఎల్‌బీ’ కాలేజీల్లో పరీక్ష కేంద్రాలు రద్దు

  • మరో 130 మంది విద్యార్థులు డీబార్‌

  • మాస్‌ కాపీయింగ్‌, ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాసినట్టు ఆరోపణలు

విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):

దూర విద్య పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన కళాశాలలు, విద్యార్థులపై ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు కొరడా ఝళిపించారు. ఇటీవల పరీక్షల నిర్వహణ సందర్భంగా కొన్ని కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ జరిగినట్టు ఆరోపణలు రావడంతో వర్సిటీ అధికారులు సమగ్ర విచారణకు కమిటీ ఏర్పాటుచేశారు. ఈ కమిటీ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా సదరు కాలేజీలపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఈ మేరకు పరీక్షలు రాయాల్సిన విద్యార్థులకు బదులుగా వేరొకరు రాసేందుకు అనుమతించిన గజపతినగరం సాయి సిద్ధార్థ, కోటనందూరులోని మదర్‌ డిగ్రీ కాలేజీలకు దూర విద్య పరీక్షా కేంద్రాన్ని నాలుగేళ్లపాటు రద్దు చేశారు. అలాగే మాస్‌ కాపీయింగ్‌ జరిగినట్టు గుర్తించిన చోడవరం ఉషోదయ, మంగళగిరి వీజేపీ డీఎల్‌బీ కాలేజీలకు పరీక్షా కేంద్రాల కేటాయింపు రెండేళ్లపాటు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇకపోతే, ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరైనట్టు గుర్తించిన మేరకు 80 మంది విద్యార్థులను ఐదేళ్లపాటు, మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన 50 మంది విద్యార్థులను రెండేళ్లపాటు డీబార్‌ చేసినట్టు అధికారులు ప్రకటించారు. దీనిపై దూర విద్యా కేంద్రం డైరెక్టర్‌ అప్పలనాయుడు మాట్లాడుతూ దూర విద్య పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు తప్పుడు మార్గాలను అనుసరించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాజమాన్యాలు పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టంచేశారు.


గోవా, కేరళ తరహాలో పర్యాటకాభివృద్ధి

విశాఖ ఉత్సవ్‌లో వినోద కార్యక్రమాలతో పాటు సాహస క్రీడలు కూడా ఉండాలి

వీఎంఆర్‌డీఏ, పర్యాటక శాఖ అధికారులతో కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):

గోవా, కేరళ తరహాలో విశాఖ జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ సూచించారు. తన కార్యాలయంలో వీఎంఆర్‌డీఏ, పర్యాటక శాఖ అధికారులతో విశాఖ ఉత్సవ్‌ ఏర్పాట్లపై శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెండు సంస్థలు కలిసి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఏయే పర్యాటక ప్రాంతానికి ఎంత మంది వస్తున్నారు?...వాటిని విభాగాల వారీగా విశ్లేషించి, అందుకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విశాఖ ఉత్సవ్‌ను విజయవంతం చేయడానికి వైవిధ్య భరితమైన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వినోద కార్యక్రమాలతో పాటు సాహస క్రీడలు కూడా ఉండాలన్నారు. నగర పరిధిలో గల ప్రతి బీచ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా ప్రణాళికలు తయారుచేయాలన్నారు. ఏ అభివృద్ధి అయినా దీర్ఘకాలిక ప్రణాళికలతోనే సాధ్యమవుతుందన్నారు. టూర్‌ ప్యాకేజీల వివరాలు జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ వెబ్‌సైట్లలో కూడా ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో వీఎంఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ కీర్తి, ఓఎస్‌డీ కృష్ణనాయక్‌, సీఏఓ రిషిబాబు, పర్యాటక శాఖ జిల్లా అధికారిణి మాధవి, డివిజనల్‌ మేనేజర్‌ జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

నాణ్యతలో స్టీల్‌ప్లాంటుకు మూడు స్వర్ణ పతకాలు

ఉక్కుటౌన్‌షిప్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): నాణ్యత పోటీల్లో విశాఖ స్టీల్‌ప్లాంటు మూడు స్వర్ణ పతకాలు సాధించింది. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఈ నెల 18 నుంచి 20 వరకు నిర్వహించిన అంతర్జాతీయ నాణ్యత నియంత్రణ వలయాల సదస్సు (ఐసీక్యూసీసీ-2026)లో స్టీల్‌ప్లాంటు బ్లాస్ట్‌ఫర్నేస్‌ విభాగం ఆంప్స్‌, ఎస్‌ఎంఎస్‌ విభాగం సాఫల్య, యుటిలిటీస్‌ విభాగం ఉన్నతి బృందాలు తమ వినూత్న సాంకేతిక ప్రాజెక్టులను ప్రదర్శించాయి. ఉత్పత్తి ప్రక్రియలో నాణ్యత పెంపు, సాంకేతిక సమస్యల పరిష్కారం, వినూత్న ఆలోచనల అమలులో ఉద్యోగుల ప్రతిభకు ఈ అవార్డులు లభించాయి. పతకాలు సాధించిన ఉద్యోగులను స్టీల్‌ప్లాంటు యాజమాన్యం అభినందించింది.


కొల్లాం రైళ్లు ఫుల్‌

ప్రత్యేక రైలుతో పాటు విశాఖ నుంచి నడుస్తున్న వారాంతపు ఎక్స్‌ప్రెస్‌లకు కూడా డిమాండ్‌

జనవరి 17 వరకు బెర్తులు ఫుల్‌

విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం విశాఖ, దువ్వాడ మీదుగా శ్రీకాకుళం రోడ్డు-కొల్లాం (08539) మధ్య ప్రవేశపెట్టిన ప్రత్యేక రైలుకు డిమాండ్‌ ఏర్పడింది. ప్రతి ఆదివారం శ్రీకాకుళం నుంచి బయలుదేరి విశాఖ, దువ్వాడ మీదుగా కొల్లాం చేరే ఈ రైలు దాదాపు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. జనవరి 24 వరకు అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక రైలుకు జనవరి 17 వరకు బెర్తులు నిండిపోయాయి. డిసెంబరు 27న మాత్రం సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ కోచ్‌లలో కొన్ని బెర్తులు ఖాళీ ఉన్నాయి. తిరుగు ప్రయాణంలో కొల్లాం నుంచి శ్రీకాకుళం వచ్చే ప్రత్యేక రైలుకు (08540) మాత్రం డిమాండ్‌ సాధారణంగా ఉంది. అదేవిధంగా విశాఖ నుంచి ప్రతి మంగళవారం బయలుదేరే విశాఖ-కొల్లాం ఎక్స్‌ప్రెస్‌ (18501), ప్రతి గురువారం బయలుదేరే విశాఖ-కొల్లాం ఎక్స్‌ప్రెస్‌ (18567) రైళ్లకు డిమాండ్‌ కొనసాగుతోంది. జనవరి వరకూ బెర్తులు రిజర్వు అయిపోయాయి. శబరిమలై భక్తుల కోసం కొల్లాంకు విశాఖ నుంచి మరో ప్రత్యేక రైలు ప్రవేశపెట్టినా వంద శాతం ఆక్యుపెన్సీ ఉంటుందని ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Updated Date - Nov 22 , 2026 | 01:19 AM