గంజాయిపై ఉక్కుపాదం
ABN , Publish Date - Aug 04 , 2026 | 01:41 AM
‘‘గంజాయి వ్యాపారులపై ఉక్కుపాదం మోపండి. గంజాయి పండించే వారిని, వ్యాపారం చేసే వారిని, రవాణా చేసేవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దు.
పండించే వారి నుంచి.. ఎవరినీ వదలొద్దు
చట్టప్రకారం ఆస్తులు సీజ్ చేయండి
పోలీసు శాఖకు స్పీకర్ అయ్యన్న ఆదేశం
నర్సీపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి):
‘‘గంజాయి వ్యాపారులపై ఉక్కుపాదం మోపండి. గంజాయి పండించే వారిని, వ్యాపారం చేసే వారిని, రవాణా చేసేవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దు. ఇటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోండి. నిబంధనల ప్రకారం వారి ఆస్తులను జప్తు చెయ్యండి. అప్పుడే గంజాయి నిర్మూలన సాధ్యమవుతుంది’’ అని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పోలీసులను ఉద్దేశంచి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సంకల్పం 2.0 కార్యక్రమాన్ని పట్టణ శివారులోని ఒక ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, చిన్న పిల్లలను ప్రలోభ పెట్టి వారితో గంజాయి రవాణా చేయిస్తున్నారని, ఇక్కడి నుంచి అడ్డ్డరోడ్డు, తుని, నక్కపల్లి ప్రాంతాలకు తీసుకువెళ్లి అప్పగిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపుతున్నారని ఆరోపించారు. గంజాయి వ్యాపారం ఎవరు చేస్తున్నారో ఆయా గ్రామాల్లో రాజకీయ నాయకులకు తెలిసినప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. నర్సీపట్నంలోని ఒక ప్రాంతంలో కొంతమంది కుర్రాళ్లకు రూ.లక్షలు ఖరీదు చేసే మోటారు సైకిళ్లు వున్నాయని, వీటిని కొనుగోలు చేసే స్థోమత వారి తల్లిదండ్రులకు లేదని, కనీసం ఈ బైకులు మీకు ఎవరు ఇచ్చారు? అని కూడా వారు అడగరని అన్నారు. కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు సైతం గంజాయి సేవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెయిన్ రోడ్డు మదుం మీద కుర్చొని మద్యం తాగుతున్నారని, దారినపోయే మహిళలను అల్లరి పెడుతున్నారని, ఇటువంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
దురలవాట్లకు దూరంగా ఉండడమే హీరోయిజం: బ్రహ్మాజీ
అందరూ తనను అరవై సంవత్సరాలు దాటినా నవ యువకుడు అని అంటున్నారని, అలా కనిపించడానికి కారణం తనకు ఎటువంటి చెడు అలవాట్లు లేకపోవడమేనని సినీ నటుడు బ్రహ్మాజీ అన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే క్రమేపీ ఆరోగ్యం క్షీణిస్తుందని, దురలవాట్లకు దూరంగా ఉండడమే హీరోయిజమని ఉద్దేశించి అన్నారు. నిర్దిష్ట లక్ష్యం పెట్టుకొని మంచి మార్గంలో నడవాలని విద్యార్థులకు సూచించారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ, గంజాయిని పూర్తిగా నిర్మూలించడానికి కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సంకల్పం 2.0 పోస్టర్‌ను ఆవిష్కరించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు కళారూపాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పోతురెడ్డి శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ, జనసేన ఇన్‌చార్జి సూర్యచంద్ర, తదితరులు పాల్గొన్నారు.