ఉపాధి అక్రమార్కులపై వేటు
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:31 AM
ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. కూలీల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చిన కొమరవోలు ఫీల్డ్ అసిస్టెంట్ మొయ్యా కృష్ణను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఏపీఓ ఈశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కొమరవోలు ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్
కూలీల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు విచారణలో నిర్ధారణ
రోలుగుంట, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. కూలీల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చిన కొమరవోలు ఫీల్డ్ అసిస్టెంట్ మొయ్యా కృష్ణను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఏపీఓ ఈశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కొమరవోలులో గత రెండు నెలలుగా ఉపాధి హమీ పథకం పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ మొయ్యా కృష్ణ, మేట్లు కలిసి, ఉపాధి పనులకు వచ్చే కూలీల నుంచి వారానికి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే వారంలో ఆరు రోజులు పనులకు వెళ్లనప్పటికీ మూడు లేదా నాలుగు రోజుల మాత్రమే పనులకు వచ్చినట్టు మస్తర్ వేస్తున్నారు. మరికొంతమందికి పనులు లేవంటూ వెనక్కు పంపేస్తున్నారు. మరోవైపు . ఫీల్డ్ అసిస్టెంట్, మేట్లకు అనుకూలంగా వుండే కూలీలు ఉదయం మస్తర్ వేసుకొని, పనులు చేయకుండా ఇతర పనులకు వెళ్లిపోయేవారు. ఇటువంటి అక్రమాలపై గ్రామానికి చెందిన బండారు వెంకట జనార్దన్, తదితరులు ఈ నెల 8వ తేదీన పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ నాగేశ్వరరావు, ఏపీఓ ఈశ్వరరావు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారుల సమక్షంలో కూలీలను, మేట్లను విచారించారు. ఉపాధి పనులకు వెళ్లకుండా, మస్తర్లు నమోదైన వారి ఇళ్లకు వెళ్లి విచారించారు. అనంతరం నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. ఫీల్డ్ అసిస్టెంట్ మొయ్యా కృష్ణపై వచ్చిన ఫిర్యాదులు వాస్తవమని విచారణలో తేలడంతో ఆయనను సస్పెండ్ చేసినట్టు ఏపీఓ ఈశ్వరరావు తెలిపారు. ఇతని స్థానంలో జానకిరామపురం ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఇన్‌చార్జిగా నియమించినట్టు చెప్పారు.