Share News

బైక్‌రేసర్లపై ఉక్కుపాదం

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:24 AM

నగరంలో బైక్‌రేసింగ్‌లకు పాల్పడుతున్న వారితోపాటు హైస్పీడ్‌ బైక్‌లతో అర్ధరాత్రి జులాయిగా రోడ్లపై విన్యాసాలు చేసే రిప్‌ రేసర్లు (ఆకతాయిల)పై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

బైక్‌రేసర్లపై ఉక్కుపాదం

బీచ్‌రోడ్డుతో పాటు రేసింగ్‌లు జరిగే ప్రాంతాల్లో పోలీసుల ప్రత్యేక తనిఖీలు

రేసింగ్‌లకు పాల్పడుతున్న ఐదుగురిపై కేసు నమోదు

ఐదు బైక్‌ల స్వాధీనం, మరికొందరి కోసం గాలింపు

తనిఖీలు ఆగిన వెంటనే బీచ్‌రోడ్డులో మళ్లీ రేసింగ్‌

తలలు పట్టుకుంటున్న పోలీసులు

విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి):

నగరంలో బైక్‌రేసింగ్‌లకు పాల్పడుతున్న వారితోపాటు హైస్పీడ్‌ బైక్‌లతో అర్ధరాత్రి జులాయిగా రోడ్లపై విన్యాసాలు చేసే రిప్‌ రేసర్లు (ఆకతాయిల)పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. వారాంతాల్లో ప్రధానంగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బీచ్‌రోడ్డు, బీఆర్‌టీఎస్‌, జాతీయరహదారి, తెలుగుతల్లి ఫ్లైవోవర్‌ ప్రాంతాల్లో రేసింగ్‌లు, స్టంట్‌లు చేస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో శనివారం రాత్రి ఒక సీఐ ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్‌ఐలు, సిబ్బందితో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.

బీచ్‌రోడ్డు, ఆశీల్‌మెట్టజంక్షన్‌ (వేమనమందిరం), అక్కయ్యపాలెం పోర్టు ఆస్పత్రి జంక్షన్‌, స్వర్ణభారతి స్టేడియం, హనుమంతవాక జంక్షన్లలో ప్రత్యేకబృందాలు రాత్రి 11 గంటల నుంచి తనిఖీలు ప్రారంభించాయి. హైస్పీడ్‌బైక్‌లతో అధికవేగం, శబ్దం వెలువరిస్తూ వాహనాలను నడిపేవారిని ఆపి, వారు ఎక్కడికి వెళుతున్నారు, డ్రైవింగ్‌లైసెన్స్‌, చిరునామా, ఫోన్‌నంబర్‌తోపాటు ఇతర వివరాలను సేకరించారు. గత శనివారం రాత్రి అక్కయ్యపాలెం జంక్షన్‌లో బైక్‌రేసింగ్‌ జరిగినట్టు ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన పోలీసులు పోర్టు ఆస్పత్రి జంక్షన్‌ నుంచి తాటిచెట్లపాలెం జంక్షన్‌ మధ్య జాతీయరహదారిపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి రేసింగ్‌లు, స్టంట్‌లు నిర్వహించిన వాహనాల గుంపులో నంబర్‌ప్లేట్‌లు కనిపించిన వాహనాలను గుర్తించారు. నంబర్‌ ఆధారంగా వారి వివరాలను సేకరించిన ఫోర్త్‌టౌన్‌ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదుచేశారు. వారి వాహనాలను సీజ్‌చేశారు. పట్టుబడినవారు ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలినవారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారం రాత్రి బీచ్‌రోడ్డులో కొందరు యువకులు పోలీసుల తనిఖీలను ముందుగానే గుర్తించి ఆమార్గంలో రాకుండా జాగ్రత్తపడినప్పటికీ, కొందరు యువకులు హైస్పీడ్‌బైక్‌లతో హెల్మెట్‌లేకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత తిరుగుతుండడంతో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వేమనమందిరం వద్ద కొందరివాహనాలను సీజ్‌చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

సోషల్‌మీడియాలో మెసేజ్‌లు

నగరంలో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారనే సమాచారాన్ని రేసర్లు, రిప్‌రేసర్లు తమ వాట్సాప్‌గ్రూపులు, ఇన్‌స్టాల ద్వారా షేర్‌చేసుకోవడంతో ఆశించినస్థాయిలో రేసర్లు పట్టుబడలేదు. ఆదివారం ఉదయం నగరానికి ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ వస్తుండడంతో పోలీసులు భారీ బందోస్తు ఏర్పాటుచేశారు. ఈ బందోబస్తుకు హాజరుకావాల్సి ఉండడంతో, శనివారం రాత్రి ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తనిఖీలు ఆపేసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న రేసర్లు, రిప్‌రేసర్లు తెల్లవారుజామున పదుల సంఖ్యలో ఒకేసారి బీచ్‌రోడ్డుకు చేరుకుని హల్‌చల్‌ చేశారు. అప్పటికే కొందరు అక్కడ వాకింగ్‌, జాగింగ్‌ కోసం రావడంతో కొందరు రేసర్ల స్టంట్‌లు, హై స్పీడ్‌ రేసింగ్‌లను చూసి భయంతో పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌ 112, డయల్‌ 100కి ఫోన్‌చేసి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఐదు గంటలు సమయానికి బీచ్‌రోడ్డుకు చేరుకున్నారు. అయితే అప్పటికే రేసర్లు చెల్లాచెదురైపోవడంతో కంగుతిన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 12:24 AM