ఐదు దశల్లో కౌంటింగ్
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:03 AM
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 10 కేంద్రాల్లో శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుందని జడ్పీ సీఈఓ సత్యనారాయణ తెలిపారు. ఆయా కేంద్రాల్లో కౌంటింగ్ విధుల్లో 4,200 మంది సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగడం వల్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఐదు దశల్లో సాగుతుందని చెప్పారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీల ఓట్లు వేర్వేరుగా లెక్కింపు
మధ్యాహ్నానానికి ఎంపీటీసీలు, సాయంత్రానికి జడ్పీటీసీల ఫలితాలు
అనకాపల్లి/ చోడవరం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 10 కేంద్రాల్లో శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుందని జడ్పీ సీఈఓ సత్యనారాయణ తెలిపారు. ఆయా కేంద్రాల్లో కౌంటింగ్ విధుల్లో 4,200 మంది సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగడం వల్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఐదు దశల్లో సాగుతుందని చెప్పారు. తొలుత ఎంపీటీసీ స్థానాల ఫలితాలు వెల్లడవుతాయని, సాయంత్రానికి జడ్పీటీసీల ఫలితాలు వచ్చేస్తాయని అన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలిలా వున్నాయి.
మొదటి దశలో తొలుత రిటర్నింగ్ అధికారి సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ బాక్సుల సీళ్లను తొలగించి ఆర్‌ఓ సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సరిచూసి, వాటిని లెక్కిస్తారు.
రెండో దశలో స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను పోలీసుల భద్రత నడుమ ఆర్‌ఓలు కౌంటింగ్ హాల్‌లోకి తీసుకువస్తారు. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో సీళ్లను పరిశీలించి, బాక్సులను తెరిచి బ్యాలెట్ పత్రాలన్నిటినీ బాస్కెట్లు/ డమ్ముల్లో పోస్తారు.
మూడో దశలో ఎంపీటీసీలకు కేటాయించిన ఎరుపు రంగు బ్యాలెట్‌లను, జడ్పీటీసీలకు కేటాయించిన తెలుపురంగు బ్యాలెట్‌లను వేరుచేస్తారు.
నాలుగో దశలో ప్రతి 25 బ్యాలెట్ పత్రాలను ఒక కట్ట చొప్పున రబ్బర్ బ్యాండ్‌లతో కడతారు. అనంతరం ఎంపీటీసీలకు సంబంధించి 40 కట్టల (1,000 ఓట్లు) చొప్పున టేబుళ్లపైకి చేర్చి, ఒక్కో కట్ట చొప్పున తెరుస్తూ.. అభ్యర్థుల వారీగా ఏర్పాటు చేసిన ట్రేలలో వేస్తారు. అనంతరం 50 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి లెక్కింపు మొదలుపెడతారు. ఎంపీటీసీ స్థానంలో పోలైన ఓట్ల మేరకు రెండు లేదా మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఇదే సమయంలో మొదటి రౌండ్‌లో అన్ని ఎంపీటీసీ స్థానాల్లో జడ్పీటీసీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కట్టలను ఒక డ్రమ్ములో వేసి, ఒక్కో టేబుల్‌కు 40 చొప్పున కట్టలను చేర్చి లెక్కింపు మొదలుపెడతారు. ఈ ప్రక్రియలో ఎంపీటీసీలతో పోలిస్తే.. జడ్పీటీసీ ఫలితాలు వెలువడడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది.
ఐదో దశలో ప్రతి ఎంపీటీసీ/ జడ్పీటీసీ అభ్యర్థులకు పోలైన ఓట్లు, చెల్లని ఓట్లు, నోటాకు పడిన ఓట్ల వివరాలను వెల్లడిస్తారు.
ఆరో దశలో ఎన్నిలైన అభ్యర్థుల పేర్లను ప్రకటించి, వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు.