Share News

కౌన్సిల్‌ హాలు ముస్తాబు

ABN , Publish Date - Nov 20 , 2026 | 01:13 AM

జీవీఎంసీ నూతన పాలకవర్గం ఈనెల 23న కొలువుదీరనున్న నేపథ్యంలో అధికారులు కౌన్సిల్‌ హాలును సిద్ధం చేస్తున్నారు.

కౌన్సిల్‌ హాలు ముస్తాబు

రూ.ఐదు లక్షలు వ్యయంతో హంగులు

కొత్తగా 30 మంది సభ్యులు కూర్చొనేలా అదనపు కుర్చీలు

విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ నూతన పాలకవర్గం ఈనెల 23న కొలువుదీరనున్న నేపథ్యంలో అధికారులు కౌన్సిల్‌ హాలును సిద్ధం చేస్తున్నారు. మేయర్‌తోపాటు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం 23న ప్రత్యేక సమావేశ నిర్వహిస్తున్నట్టు సభ్యులకు ఇప్పటికే సమాచారం అందజేశారు.

జీవీఎంసీలో గతంలో 98 వార్డులు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 120కి పెరిగింది. అలాగే కో-ఆప్షన్‌ సభ్యులు కూడా గతంలో ఐదుగురు ఉండగా వారి సంఖ్య ఏడు లేదా తొమ్మిదికి పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అదనంగా కుర్చీలు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుతం ఉన్న కౌన్సిల్‌హాలులో 105 కుర్చీలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా పెరిగే సభ్యులకు సరిపోయేలా 30 కుర్చీలను అదనంగా ఏర్పాటుచేస్తున్నారు. వారికి బెంచీపైనే మైక్‌ సదుపాయం కల్పించడం, మేయర్‌కు కొత్త కుర్చీని సిద్ధం చేయడంలో అధికారులు బిజీగా ఉన్నారు. కౌన్సిల్‌ హాల్‌లో సీలింగ్‌ దెబ్బతినడంతో దానిని సరిచేశారు. గతంలో ఉన్న డిప్యూటీ మేయర్‌ ఛాంబర్‌ను ఇప్పటికే అదనపు కమిషనర్‌కు కేటాయించినందున, కొత్తగా ఎన్నికయ్యే డిప్యూటీ మేయర్‌కు ఛాంబర్‌ ఎక్కడ కేటాయించాలి, టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, సీపీఎం ఫ్లోర్‌ లీడర్లకు ఛాంబర్‌ల కేటాయింపుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. గతంలో డిప్యూటీ మేయర్‌కు కేటాయించిన ఛాంబర్‌ను తిరిగి డిప్యూటీ మేయర్‌కు కేటాయించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే టీడీపీ సభ్యులు 64 మంది ఉండడంతో ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్‌కు గతంలో ఇచ్చిన ఛాంబర్‌ సరిపోదు. అందువల్ల గతంలో వైసీపీ, టీడీపీలకు కేటాయించిన రెండు ఛాంబర్లను కలిపి ఒకటిగా చేయాలని యోచిస్తున్నారు. అలా జరిగితే వైసీపీ, జనసేన పార్టీలకు ఎక్కడ ఛాంబర్‌ కేటాయించాలనే దానిపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు.

Updated Date - Nov 20 , 2026 | 01:14 AM