కంబాలకొండలో కాటేజీలు
ABN , Publish Date - Mar 07 , 2026 | 01:11 AM
రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో గల కంబాలకొండలో పర్యాటకులు రాత్రిపూట బస చేయడానికి వీలుగా కాటేజీలు నిర్మించాలని అటవీ శాఖ నిర్ణయించింది.
రాత్రి బసకు అవకాశం
పర్యాటకులను ఆకర్షించడానికి కొత్త ప్రయోగం
ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్ సూచనతో అటవీ శాఖ ప్రతిపాదనలు
ఒక్కో కాటేజీ నిర్మాణానికి రూ.15 లక్షలు అవుతుందని అంచనా
విశాఖపట్నం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి):
రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో గల కంబాలకొండలో పర్యాటకులు రాత్రిపూట బస చేయడానికి వీలుగా కాటేజీలు నిర్మించాలని అటవీ శాఖ నిర్ణయించింది. దేశంలో అటవీ ప్రాంతాలను సందర్శించేవారి సంఖ్య ఏటేటా పెరుగుతుంది. కొందరు అక్కడే రాత్రిపూట బస చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కర్ణాటకలో జంగిల్ రిసార్ట్స్, లాడ్జిలకు మంచి ఆదరణ లభిస్తోంది. అందుకోసం ఆ రాష్ట్రం ప్రత్యేకించి ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది. ఇదే బాటలో పలు రాష్ట్రాలు అటవీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో పర్యాటకుల కోసం అడవుల్లో ప్రత్యేకించి సదుపాయాలు కల్పించాలని అటవీ శాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సూచించారు. దీంతో కంబాలకొండలో రాత్రి పూట పర్యాటకులు గడిపేందుకు అనువుగా నాలుగైదు కాటేజీలు నిర్మించాలని ప్రతిపాదించారు.
నగరానికి ఆనుకుని విస్తరించిన సుమారు 15 వేల ఎకరాల రిజర్వు ఫారెస్టులో కంబాలకొండ ఎకో టూరిజం పార్కు ఉంది. రిజర్వు ఫారెస్టులో ఒకప్పుడు పలు రకాల జంతువులు ఉండేవి. చిరుతపులులు కూడా సంచరించేవి. అయితే నగరీకరణ పెరగడంతో చిరుతలు దాదాపు అంతరించిపోయాయి. జింకలు మాత్రం వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం కంబాలకొండకు ఉదయం నుంచి సాయంత్రం వరకూ మాత్రమే సందర్శకులను అనుమతిస్తున్నారు. ఇటీవల సుమారు రూ.1.5 కోట్లతో గెస్ట్ హౌస్, యాంపీ థియేటర్, యోగా, మెడిటేషన్ హాలు, వ్యూ పాయింట్ నిర్మించారు. చెరువులో బోటింగ్ సదుపాయం కల్పించారు. ఇకపై రాత్రి బస చేసేలా గెస్ట్ హౌస్‌కు అదనంగా నాలుగైదు కాటేజీలు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, రక్షణ ఏర్పాట్లు, రెస్టారెంట్ సౌకర్యం వంటివి ఉంటాయి. ఒక్కొక్క కాటేజీకి రూ.15 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేసిన తరువాత ఒక అంచనాకు రావచ్చునని అధికారులు వివరించారు.
కంబాలకొండ పార్కులో పర్యాటకులకు సదుపాయాలు పెంపు
రవీంద్రదామా, జిల్లా అటవీ శాఖాధికారి, విశాఖపట్నం( పోటో ఉంది)
కంబాలకొండ రిజర్వు ఫారెస్టులో ఉన్న పార్కులో పర్యాటకులకు సదుపాయాలు పెంచుతాం. ఇప్పటికే నగరవనం అభివృద్ధిలో భాగంగా గెస్టుహౌస్, వ్యూపాయింట్ ఏర్పాటు, సందర్శకులు కూర్చునేందుకు వీలుగా సదుపాయాలు కల్పించాం. బోటింగ్ ఉంది. అయితే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సూచన మేరకు రాత్రిపూట పర్యాటకులు బస కోసం కాటేజీలు నిర్మిస్తాం. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతాం. ప్రస్తుతం ప్రతినెల సందర్శకుల ప్రవేశ ఫీజు కింద రమారమి రూ.నాలుగు లక్షల ఆదాయం వస్తోంది. కంబాలకొండ నిర్వహణ, సిబ్బంది జీతాలకు రూ.3 లక్షలు వ్యయం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో రాత్రిపూట పర్యాటకులు ఉండేలా సదుపాయాలు కల్పించడం ద్వారా ఆదాయం పెంచాలన్నదే డిప్యూటీ సీఎం ఆలోచన. కంబాలకొండ చుట్టూ దశల వారీగా ఫెన్సింగ్ నిర్మిస్తున్నాం. ఈ ఏడాది 2.5 కిలోమీటర్ల పొడవునా ఫెన్సింగ్ వేశాం. రిజర్వు ఫారెస్టులో జంతువులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.