ఇండోర్ స్టేడియం పనుల్లో అవినీతి
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:18 AM
స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ఆధునికీకరణ పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని సాక్షాత్తూ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. రూ.16.9 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో ఆధునికీకరించిన స్వర్ణభారతి ఇండోర్ స్టేడియాన్ని మంగళవారం ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు.
నాణ్యత లోపించిందంటూ మేయర్ అసంతృప్తి
విజిలెన్స్ విచారణ కోరాలంటూ కమిషనర్‌కు లేఖ
విశాఖపట్నం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి):
స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ఆధునికీకరణ పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని సాక్షాత్తూ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. రూ.16.9 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో ఆధునికీకరించిన స్వర్ణభారతి ఇండోర్ స్టేడియాన్ని మంగళవారం ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మేయర్ పీలా శ్రీనివాసరావు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం బయట కారు దిగగానే కొత్తగా నిర్మించిన బీటీరోడ్డును చూసి అవాక్కయ్యారు. రోడ్డుపై తారు, రాళ్లపిక్కలు విడివిడిగా కనిపించడంతో నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. పనులను పర్యవే క్షించిన ఈఈ గంగాధర్‌ను పిలిచి రోడ్డు నిర్మాణంపై ప్రశ్నించారు. రోడ్డు వేసి వారం రోజులు కూడా కాకముందే గుంతలమయంగా ఉంటే తర్వాత పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అనంతరం స్టేడియం లోపలకు వెళ్లిన ఆయన ప్రారంభోత్సవం తర్వాత తిరిగి బయటకు వస్తూ...స్టేడియం ఆధునికీకరణ పనులు సక్రమంగా జరగలేదని కమిషనర్ కేతన్‌గార్గ్‌కు వివరించారు. రూ.16.9 కోట్లు వెచ్చించినప్పటికీ అందుకు తగ్గట్టు పనులు జరగలేదని, స్టేడియం లోపల వేసిన వుడెన్ ఫ్లోరింగ్ అప్పుడే ఎగుడుదిగుడుగా తయారైందని కొందరు క్రీడాకారులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. స్టేడియం బయట ఎలివేషన్, గ్యాలరీలో కుర్చీలు, స్టేడియం లోపల ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు, మరుగుదొడ్ల ఆధునికీకరణ తప్పితే చెప్పుకోదగిన స్థాయిలో సివిల్ వర్కులు కూడా జరగలేదని, దీనికి రూ.16.9 కోట్లు ఖర్చు అయుందంటే నమ్మశక్యంగా లేదన్నారు. స్టేడియం పనుల నాణ్యతపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో విచారణ జరిపించాలని ఇటీవల తాను ఇచ్చిన లేఖపై స్పందించాలని కోరాలని కమిషనర్‌ను కోరారు. మేయర్ ఆరోపణలపై కొందరు కార్పొరేటర్లు, అఽధికారులు సైతం ఏకీభవించడంతో స్టేడియం పనుల నాణ్యతపై అనుమానాలకు బలాన్ని చేకూర్చినట్టయింది.