Share News

ఉపాధి పనుల్లో అవినీతి

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:42 AM

కొలతల్లో తేడాలతో పాటు శ్రామికుల మస్తర్లు దిద్దుబాట్లు చేసి అవినీతికి పాల్పడినట్టు ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల్లో బట్టబయలైంది.

ఉపాధి పనుల్లో అవినీతి
ప్రజావేదికలో పంచాయతీలవారీగా గుర్తించిన తేడాలను వివరిస్తున్న డీఆర్‌పీలు

కొలతల్లో తేడాలు, మస్తర్ల దిద్దుబాట్ల ద్వారా రూ.2 కోట్లు పక్కదారి

సామాజిక తనిఖీల్లో బట్టబయలు

కొందరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు తప్పును సరిదిద్దుకోగా, మరికొందరు సరిచేసుకుంటామని అంగీకారం

అవకతవకలకు పాల్పడిన వారి నుంచి రికవరీకి పీడీ విద్యాసాగర్‌ ఆదేశం

కొయ్యూరు, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): కొలతల్లో తేడాలతో పాటు శ్రామికుల మస్తర్లు దిద్దుబాట్లు చేసి అవినీతికి పాల్పడినట్టు ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల్లో బట్టబయలైంది. మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం ద్వారా ఖర్చు చేసిన రూ.40.35 కోట్లకు సంబంధించి గత రెండు నెలలుగా మండలంలోని 33 పంచాయతీలలో 17వ విడత సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ప్రజా వేదికను బుధవారం నిర్వహించారు. పంచాయతీలవారీగా డీఆర్‌పీలు సామాజిక తనిఖీలు నిర్వహించి పనుల కొలతల్లో తేడాల ద్వారా సుమారు రూ.2 కోట్లు అవినీతికి పాల్పడినట్టు తేల్చారు. కొన్ని పంచాయతీల ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమ తప్పును సరిదిద్దుకుని కొలతల ప్రకారం పనులు చేయించి ఆ ఫొటోలను ప్రజావేదిక ముందు ఉంచారు. మరికొందరు జరిగిన పొరపాటును సరిచేసుకుంటామని పీడీ విద్యాసాగర్‌ ముందు అంగీకరించారు. ఇకపై ఇటువంటి తప్పులు జరిగితే ఉపేక్షించబోమని వారిని విద్యాసాగర్‌ హెచ్చరించారు. అలాగే మస్తర్లు దిద్దుబాట్లు ద్వారా కొందరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు అవినీతికి పాల్పడినట్టు గుర్తించి వారి నుంచి రికవరీకి ఆయన ఆదేశించారు. అనంతరం పంచాయతీలవారీగా జరిగిన ఆడిట్‌లో గుర్తించిన అంశాలను డీఆర్‌పీలు ప్రజావేదిక ముందుంచారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ సీతయ్యనాయుడు, ఎస్‌ఆర్‌పీలు అచ్యుతరావు, చిరంజీవి, ఏవీవోలు వై.వెంకటరావు, బాలాజీ, క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్‌ వైఎంవీ రమణ, ఎంపీడీవో జీడీవీ ప్రసాద్‌, ఎంపీపీ రమేశ్‌బాబు, ఎస్‌ఎంఐ జేఈ రామకృష్ణ, 33 పంచాయతీల వీఆర్‌పీలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, అధిక సంఖ్యలో జాబ్‌కార్డుదారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 12:42 AM