Share News

పౌర సేవల్లో అవినీతికి పాల్పడితే వేటు

ABN , Publish Date - Jan 09 , 2026 | 10:30 PM

పౌర సేవలు అందించే క్రమంలో అవినీతికి పాల్పడితే అందుకు బాధ్యులైన వారిపై వేటు తప్పదని అధికారులకు ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు.

పౌర సేవల్లో అవినీతికి పాల్పడితే వేటు
ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ

అధికారులకు ఇన్‌చార్జి జేసీ శ్రీపూజ హెచ్చరిక

జిల్లా స్థాయి అధికారులు క్షేత్ర స్థాయి

పరిస్థితులను పరిశీలించాలని ఆదేశం

పాడేరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): పౌర సేవలు అందించే క్రమంలో అవినీతికి పాల్పడితే అందుకు బాధ్యులైన వారిపై వేటు తప్పదని అధికారులకు ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం పీజీఆర్‌ఎస్‌ ప్రారంభానికి ముందు ఆమె అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షలు నిర్వహించిన సందర్భాల్లోను.. సచివాలయాలను తనిఖీలు చేసిన క్రమంలో పౌర సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. అటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అధికారుల వద్దకు వచ్చే అర్జీదారులపై దురుసు ప్రవర్తన, వారి సమస్యను పరిష్కరించకపోవడమే కాకుండా వారికి సేవలందించేందుకు డబ్బులు డిమాండ్‌ చేస్తే అది అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందన్నారు. ఒకసారి ఆ చట్టంలో కేసు నమోదైతే.. తాను తప్పు చేయలేదని నిరూపించుకోవడం అత్యంత కష్టతరమన్నారు. పౌర సేవలకు సంబంధించి దాఖలు చేసిన నోటీసుల కాపీలను భద్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వానికి, అధికారులకు రక్షణగా ఉండేందుకు ప్రతి అంశాన్ని విధిగా రికార్డు చేయాలన్నారు. పనుల కోసం అధికారులు డబ్బులు అడుగుతున్నారని లబ్ధిదారులు ఆరోపణలు చేస్తే, బాధితులతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకుంటామని, బాధ్యులపై చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వం సైతం వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఏవీఆర్‌ఎస్‌ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తున్నాదని, ఈక్రమంలో తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని శ్రీపూజ సూచించారు. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనే విషయాలను తెలుసుకునేందుకు జిల్లా స్థాయి అధికారులు రోజుకు కనీసం ఒక గంట సమయం అందుకు కేటాయించాలన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది ఇచ్చే నివేదికలు, వివరాలను గుడ్డిగా నమ్మవద్దని, వాస్తవ పరిస్థితులపై దృష్టి సారించాలన్నారు. పనితీరు లోపాలు, నిర్లక్ష్యం ఉంటే నిబంధనల మేరకు బాధ్యులపై జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ పేర్కొన్నారు.

పీజీఆర్‌ఎస్‌లో 81 వినతులు స్వీకరణ

స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(మీకోసం)లో గిరిజనుల నుంచి అధికారులు 81 వినతులను స్వీకరించారు. ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఎంవీఎస్‌.లోకేశ్వరరావులతో కలిసి పీజీఆర్‌ఎస్‌ను నిర్వహించారు. మీకోసంలో అర్జీదారులు తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోకుంటే 1100 నంబర్‌కు ఫోన్‌ చేసి సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో శ్రీపూజ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కృష్ణమూర్తినాయిక్‌, డీఈవో కె.రామకృష్ణారావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్‌ , గనుల శాఖ ఏడీ ఆనంద్‌, జాతీయ రహదారుల డిప్యూటీ తహశీల్దార్‌ వి.ధర్మరాజు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 10:30 PM