ట్రాఫిక్ పోలీసుల చేతివాటం
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:07 AM
‘పెందుర్తి పోలీస్‌స్టేషన్ సమీప బీఆర్‌టీఎస్‌రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు ఆదివారం ఉదయం వాహనాల తనిఖీ చేపట్టారు.ఆ సమయంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న విజయనగరానికి చెందిన ఓ వ్యక్తి హెల్మెట్ ధరించకపోవడంతో ఆపారు. హెల్మెట్ లేకపోతే రూ.1,035 జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫోన్‌పేలో డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండగా, అతడి వద్దకు ఓ కానిస్టేబుల్ వెళ్లి జేబులో డబ్బులు ఎంత ఉన్నాయని అడిగాడు. రూ.500 ఉంనదడంతో, ఆ మొత్తాన్ని తీసుకుని పంపించేశారు.’
ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ
పట్టుబడినవారికి ఈ-చాలాన్ బెదిరింపులు
పక్కకుతీసుకెళ్లి జేబులో డబ్బులు ఎంత ఉన్నాయని ఆరా!
బేరం కుదిరితే కేసులేకుండానే వదిలేస్తున్న వైనం
కాసులు కురిపిస్తున్న డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు
సీపీ దృష్టిసారించాలంటున్న వాహన చోదకులు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
‘పెందుర్తి పోలీస్‌స్టేషన్ సమీప బీఆర్‌టీఎస్‌రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు ఆదివారం ఉదయం వాహనాల తనిఖీ చేపట్టారు.ఆ సమయంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న విజయనగరానికి చెందిన ఓ వ్యక్తి హెల్మెట్ ధరించకపోవడంతో ఆపారు. హెల్మెట్ లేకపోతే రూ.1,035 జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫోన్‌పేలో డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండగా, అతడి వద్దకు ఓ కానిస్టేబుల్ వెళ్లి జేబులో డబ్బులు ఎంత ఉన్నాయని అడిగాడు. రూ.500 ఉంనదడంతో, ఆ మొత్తాన్ని తీసుకుని పంపించేశారు.’
నగరంలో ఈ తరహా దందాలు నిత్యకృత్యమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్ విధుల్లో ఉన్నకొందరు సిబ్బంది తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉల్లంఘనలతో పట్టుబడే వాహన చోదకులను జరిమానా, కేసుల పేరుతో బెదిరించి వారి నుంచి డబ్బు దండుకుని పంపించేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఉన్నప్పటికీ ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో పట్టించుకోవడం లేదు.
నగరంలో రోడు ్డప్రమాదాల నియంత్రణలో భాగంగా వాహన చోదకులు తప్పనిసరిగా రోడ్డు భద్రత, మోటార్‌వాహనచట్టం నిబంధనలు పాటించేలా ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ఒక ఎస్‌ఐ/ఏఎస్‌ఐ స్థాయి అధికారి సమక్షంలో హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోంగార్డులు వాహనాలను తనిఖీ చేయాల్సివుంటుంది. ఎవరైనా ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, సీట్‌బెల్ట్ పెట్టుకోకుండా కారు నడపడంతోపాటు లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, నెంబర్ ప్లేట్ సరిగా లేకపోయినా, వాహనం పత్రాలు లేకపోయినా వాహనాన్ని సీజ్‌చేయడం, లేదంటే జరిమానాతో ఈ-చలాన్ జారీచేసి వాహనాన్ని పంపించాలి. ఇదే అదనుగా కొందరు ట్రాఫిక్ పోలీసులు జేబులు నింపుకుంటున్నారు. ఏదో ఒక ఉల్లంఘనతో పట్టుబడిన వాహన చోదకుడిని పక్కకు తీసుకెళ్లి ఈ-చలాన్‌జారీచేస్తే రూ.వెయ్యి, రూ.ఐదువేలు జరిమానా కట్టాల్సి వుంటుందని బెదిరిస్తున్నారు. అంతమొత్తం అనేసరికి భయంతో వాహనచోదకులు ఏదో ఒకటిచేసి జరిమానాలేకుండా వదిలేయాలని వేడుకుంటున్నారు. అదే అదనుగా సిబ్బంది తమ అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నారు. వారి వద్ద ఉన్న మొత్తాన్ని ఇచ్చి వెళ్లిపోవాలని వాహనచోదకులకు మేలుచేసినట్టు చెప్పి పంపించేస్తున్నారు. దీనివల్ల పెద్దగా జరిమానా కట్టాల్సిన పనిలేదన్నట్టు వాహనచోదకులు మళ్లీమళ్లీ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడడుతున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల తీవ్రతకు అడ్డుకట్టపడకపోగా, ప్రజల్లో పోలీస్‌శాఖకు చెడ్డపేరు వస్తోంది. నగరంలోని దాదాపు అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలోనూ ఇది నిత్యకృత్యంగా మారిందని వాహనచోదకులు ఆరోపిస్తున్నారు.
డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీల్లో ఎస్‌ఐల చేతివాటం
నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు మద్యంసేవించి వాహనాలు నడపడమే కారణమని పోలీసులు గుర్తించారు. దీంతో మద్యంమత్తులో వాహనం నడపకుండా డ్రంకెన్‌డ్రైవ్ పేరుతో ప్రతీరోజూ సాయంత్రం, రాత్రివేళ, తెల్లవారుజామున తనిఖీలు చేస్తుంటారు. ట్రాఫిక్, లాఅండ్‌ఆర్డర్ పోలీసులు కూడా బ్రీత్‌అనలైజర్లతో రోడ్లపై కాపుకాసి పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఎవరైనా మద్యంసేవించినట్టు తేలితే వాహనాన్ని సీజ్‌చేసి, డ్రైవింగ్‌లైసెన్స్, ఆధార్‌కార్డు తీసుకుని పంపించేసి, మరుసటిరోజు పోలీస్‌స్టేషన్‌కు వస్తే వాహనం పత్రాలను తీసుకుని రిలీజ్ చేస్తారు. తర్వాత వారిని కోర్టులో హాజరుపరిస్తే కోర్టు జరిమానా లేదా జైలుశిక్ష లేదా సామాజికసేవ వంటి శిక్షలు విధిస్తుంది. దీంతో డ్రంకెన్‌డ్రైవ్ కేసులో పట్టుబడినవారు పోలీసులకు ఎంతైనా ఇచ్చి కేసులేకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఎస్‌ఐలకు ఇది వరంగా మారింది. ప్రతిరోజూ కనీసం పదిమంది వరకు డ్రంకెన్‌డ్రైవ్ కేసుల్లో పట్టుబడుతుంటారు. వారిలో ఐదు కేసులను అధికారికంగా కోర్టుకు చూపిస్తే.. మిగిలిన ఐదు కేసుల్లో పట్టుబడినవారి నుంచి రూ.ఐదు వేలు నుంచి రూ.పదివేలు వరకు వసూలు చేసి కేసులేకుండా వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంతో ఒక ఎస్‌ఐ, ఏఎస్‌ఐ డ్రంకెన్‌డ్రైవ్ వసూళ్లకు పాల్పడుతుండడంతో వారిని సీపీ సస్పెండ్‌చేశారు. అయినప్పటికీ కొందరు పోలీసుల తీరు మారలేదు. తనిఖీల పేరుతో విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతుండడంతో ప్రజల్లో పోలీస్‌శాఖ ప్రతిష్ట మసకబారుతోందని, ఇప్పటికైనా వసూల్‌రాజాలకు చెక్ పెట్టాలని సీపీని నగరవాసులు కోరుతున్నారు.