మాజీలు కానున్న కార్పొరేటర్లు
ABN , Publish Date - Mar 17 , 2026 | 01:24 AM
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం మంగళవారంతో ముగియనున్నది.
నేటితో జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం పూర్తి
రేపటి నుంచి స్పెషలాఫీసర్ పాలన ప్రారంభం
ఆరు నెలల్లోగా ఎన్నికలు జరిగేనా?
చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేయదలిస్తే ఆలస్యం అయ్యే అవకాశం
నేడు కార్పొరేటర్లకు వీడ్కోలు, సత్కారం
విశాఖపట్నం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి):
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం మంగళవారంతో ముగియనున్నది. జీవీఎంసీకి 2021 మార్చి 14న ఎన్నికలు జరగ్గా, అదే నెల 18న కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల పదవీకాలం మంగళవారం నాటికి పూర్తవుతుండడంతో కార్పొరేటర్లంతా మాజీలు కాబోతున్నారు.
ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యేసరికి జీవీఎంసీకి తిరిగి ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వంటివి ఉండడం వల్ల వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం లేకుండాపోయింది. పరీక్షల సీజన్‌ముగిసినప్పటికీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసిన తరువాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కులగణన ప్రారంభించడంతో రెండు, మూడు నెలల్లో ఆ కార్యక్రమంతో పాటు రిజర్వేషన్ల ఖరారు కూడా కొలిక్కివస్తుందని భావిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే స్థానిక సంస్థలకు ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల ప్రకటించారని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాష్ట్రంలోని అన్ని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలతోపాటు జీవీఎంసీలో వచ్చే ఆరు నెలల్లో కొత్తపాలకవర్గం కొలువుదీరుతుందని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు జీవీఎంసీలో భీమిలి మండలంలోని మిగిలిన గ్రామాలతోపాటు ఆనందపురం, పద్మనాభంలోని 72 గ్రామాలు, పెందుర్తి మండలంలోని మిగిలిన గ్రామాలను విలీనం చేయాలనే ప్రతిపాదన ఉంది. దీనిపై పెందుర్తి, భీమిలి ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి లేఖ రాయగా, విలీనంపై పరిశీలించి నివేదిక పంపించాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. జీవీఎంసీ అధికారులు విలీనానికి సాధ్యాసాధ్యలను పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ఆయా గ్రామాల విలీనానికి అనుకూలంగా అధికారులు నివేదిక పంపిస్తే మాత్రం జీవీఎంసీకి ఎన్నికలు ఆలస్యం అవుతాయని జీవీఎంసీ అధికారులతోపాటు ప్రస్తుత కార్పొరేటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. భీమిలి, అనకాపల్లి మునిసిపాలిటీలతో సహా కొన్ని గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు దాదాపు ఏడేళ్లపాటు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందేమోనని ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న నాయకులు ఆందోళన చెందుతున్నారు. పాలకవర్గం రద్దు కానుండడంతో కలెక్టర్‌ను ఇప్పటికే జీవీఎంసీ స్పెషలాఫీసర్‌గా ప్రభుత్వం నియమించింది. బుధవారం నుంచి జీవీఎంసీలో నిర్ణయాలను జిల్లా కలెక్టర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలావుండగా జీవీఎంసీ కార్పొరేటర్ల పదవీకాలం ముగుస్తుండడంతో మంగళవారం సాయంత్రం రుషికొండలోని సాయిప్రియ రిసార్ట్సులో వీడ్కోలు సభ, సత్కార కార్యక్రమాన్ని జీవీఎంసీ అధికారులు ఏర్పాటుచేశారు.