పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం
ABN , Publish Date - Apr 13 , 2026 | 01:07 AM
పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను చేరువ చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగిన సేవలు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
ఛాతి, అంటువ్యాధుల ఆస్పత్రిలో ఎండో బ్రాంకియల్ ఆల్ర్టా సౌండ్ మెషిన్ ప్రారంభం
విశాఖఫట్నం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి):
పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను చేరువ చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం పెదవాల్తేరులోని ఛాతి, అంటువ్యాధుల ఆస్పత్రిలో ఎండో బ్రాంకియల్ ఆల్ర్టా సౌండ్ మెషిన్ (ఈబస్)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా మిషన్ మొట్టమొదటిదని, దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ఆస్పత్రుల్లో సదుపాయాలను మెరుగుపరిచామని, దీంతో ఓపీ, ఐపీ సేవలు గణనీయంగా పెరిగాయన్నారు. ఈ ఆస్పత్రిలో 2023లో 35 వేలు ఓపీ నమోదు కాగా, 2025 నాటికి 45 వేలకు చేరిందన్నారు. మేజర్ సర్జరీలు 359 నుంచి 449కు పెరిగాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను ఉచిత క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, కర్నూలు, విశాఖపట్నం, కడప, గుంటూరుల్లో అత్యాధునిక క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. డయాలసిస్ మిషన్ల సంఖ్యను 550 నుంచి 725కు పెంచి కిడ్నీ బాధితులకు భరోసా కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించేలా త్వరలోనే హెల్త్ స్కీమ్‌ను అమలు చేయబోతున్నామని చెప్పారు. కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ, కార్పొరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులో వున్నాయని తెలిపారు.
సీఎస్‌ఆర్ నిధులతో ఆస్పత్రుల్లో మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ. కార్యక్రమంలో ఎన్‌టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, ఛాతి, అంటువ్యాధుల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.