Share News

సహజ వనరులపై కార్పొరేట్‌ శక్తుల కన్ను

ABN , Publish Date - Feb 08 , 2026 | 10:59 PM

గిరిజన ప్రాంత సహజ వనరులపై కార్పొరేట్‌ శక్తుల కన్నుపడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం లంబసింగి, తాజంగిలో ఆయన పర్యటించారు.

సహజ వనరులపై కార్పొరేట్‌ శక్తుల కన్ను
విలేకరుల సమావేశంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

ఆదివాసీలకు శతశాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు శాసన సభలో బిల్లు పెట్టాలి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

చింతపల్లి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంత సహజ వనరులపై కార్పొరేట్‌ శక్తుల కన్నుపడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం లంబసింగి, తాజంగిలో ఆయన పర్యటించారు. అనంతరం మండల కేంద్రంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గిరిజన ప్రాంత సంపదను కార్పొరేట్‌ సంస్థలు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. గిరిజన ప్రాంత సంపదను దోచుకోవాలనే లక్ష్యంతో రూ.వేల కోట్లు ఖర్చు చేస్తూ జాతీయ రహదారులను ప్రభుత్వాలు నిర్మిస్తున్నాయని ఆయన ఆరోపించారు. హోం స్టే పేరిట ఓయో సంస్థకు అప్పగిస్తే ఆదివాసీలకు కలిగే ప్రయోజనం శూన్యమన్నారు. ఐటీడీఏకు హోం స్టే, పర్యాటక ప్రాంతాల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే ఆదివాసీలకు మేలు జరుగుతుందన్నారు. ఆదివాసీలకు శతశాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు శాసన సభ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీ ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు భరోసాగా నిలవాలన్నారు. కాఫీ బెర్రీ బోరర్‌ కీటకం ఆశించిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, కార్యవర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్య పడాల్‌, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజయ్‌, మండల నాయకుడు సాగిన చిరంజీవి పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 10:59 PM