ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్య
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:21 PM
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోనూ కార్పొరేట్ స్థాయి విద్య అందుతున్నదని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు.
జిల్లా కలెక్టర్ నిషాంతి
పాడేరులో ఘనంగా ‘మన బడి- మన పండగ’
పాడేరు, జూన్ 12 (ఆంధ్రజ్యోతి):
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోనూ కార్పొరేట్ స్థాయి విద్య అందుతున్నదని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. పాఠశాలల పునఃప్రారంభం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని గుడివాడ మోడల్ ప్రైమరీ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ‘మన బడి- మన పండగ’ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో సైతం కార్పొరేట్ స్థాయిలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. బడిఈడు పిల్లల్ని విధిగా పాఠశాలల్లో చేర్పించాలని ఆమె తల్లిదండ్రులకు సూచించారు. బడిలో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగానే విద్యతోపాటు వారికి అవసరమైన పుస్తకాలు, బ్యాగు, బూట్లు, తదితరలను అందిస్తుందన్నారు. అలాగే మధ్యాహ్న భోజనం సైతం పాఠశాలల్లోనే చేసే అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. విద్యకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు వచ్చిన కలెక్టర్‌కు విద్యార్థులు బొకేలు అందించి స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులకు ప్రభుత్వం కేటాయించిన విద్యా కానుకలైన బ్యాగులు, బూట్లు, తదితరులను జిల్లా కలెక్టర్ నిషాంతి అందించి, వారితో విద్యా ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారులు బి.విశ్వనాథం, సీహెచ్.సరస్వతి, పాఠశాల హెచ్‌ఎం కె.రామ్మూరినాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.