పేదలకు పట్టాభిషేకం
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:53 AM
వేలాది మంది పేదలకు సొంతింటి కల సాకారం కానున్నది. జిల్లాలో ప్రభుత్వ స్థలాలు, కొండవాలు ప్రాంతాలు, తదితరచోట్ల నివాసాలు ఏర్పాటుచేసుకుని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న వారికి వాటిపై హక్కు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ప్రభుత్వ స్థలాలు, కొండవాలు ప్రాంతాల్లోని నివాసితులకు హక్కు పత్రాలు పంపిణీ
23,2,83 మందికి కన్వేయన్స్ డీడ్లు, 5,162 మందికి పట్టాలు
మొత్తం 399.474 ఎకరాలు....విలువ రూ. 8,874.27 కోట్లు
అత్యధికంగా విశాఖ రూరల్ మండలంలో 9,261 మందికి లబ్ధి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా కార్యక్రమం
విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):
వేలాది మంది పేదలకు సొంతింటి కల సాకారం కానున్నది. జిల్లాలో ప్రభుత్వ స్థలాలు, కొండవాలు ప్రాంతాలు, తదితరచోట్ల నివాసాలు ఏర్పాటుచేసుకుని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న వారికి వాటిపై హక్కు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం వేదిక కానున్నది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు 28,445 మందికి పట్టాలు, కన్వేయన్స్ డీడ్స్ (ఆస్తి యాజమాన్య బదిలీ పత్రం) పంపిణీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా ప్రారంభం కానున్నది. క్రమబద్ధీకరించనున్న భూమి విస్తీర్ణం 399.474 ఎకరాలు, విలువ రూ.8,874.27 కోట్లుగా అధికారులు చెబుతున్నారు. విశాఖ రూరల్ మండలంలో అత్యధికంగా 9,261 మంది పట్టాలు అందుకోనున్నారు. మొత్తం 28,445లో 23,283 మందికి కన్వేయన్స్ డీడ్లు, 5,162 మందికి పట్టాలు పంపిణీ చేస్తారు.
నగరంలో ప్రభుత్వ స్థలాలు, కొండవాలు ప్రాంతాలు, చెరువు గట్లు...ఇలా పలు ప్రాంతాల్లో దశాబ్దాలుగా కొంతమంది ఆవాసాలు ఏర్పాటుచేసుకుని నివాసం ఉంటున్నారు. ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నా వాటిపై హక్కులు లేకపోవడంతో ఇబ్బందిపడుతుండేవారు. ఈ నేపథ్యంలో 2014లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబునాయుడుకు ఇళ్ల క్రమబద్ధీకరణ సమస్యను ఎమ్మెల్యేలు నివేదించారు. దాంతో అర్హుల వివరాలు సేకరించిన అధికారులు, పలు కేటగిరీలుగా విభజించారు. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారికి 100 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించేందుకు జీవో 296ను జారీచేశారు. దారిద్య్రరేఖకు ఎగువనున్న ఆక్రమణదారులకు 100 గజాల వరకు ఉచితం, ఆపై కేటగిరీలుగా సొమ్ము చెల్లించడానికి జీవో 388, గాజువాకలో ఆక్రమణల క్రమబద్ధీకరణ కోసం జీవో 45, యూఎల్‌సీ ఆక్రమణల క్రమబద్ధీకరణకు జీవో 84 జారీచేశారు. 100 గజాల కంటే తక్కువ జాగాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారు ఎక్కువమంది ఉన్నారు. ఆయా కేటగిరీల కింద గుర్తించిన ఆక్రమణదారులకు 2017 నుంచి 2019 వరకు మూడు దఫాలుగా పట్టాలు ఇచ్చారు. ఇందుకు సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇళ్లపై పేద వర్గాలకు హక్కులు వచ్చాయి. పట్టాలు జారీచేసిన రెండేళ్ల తరువాత కన్వేయన్స్ డీడ్లు ఇవ్వాల్సి ఉంది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో ఈ విషయాన్ని పట్టించుకోలేదు. తిరిగి 2024లో చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నగరంలో పట్టాలకు దరఖాస్తు చేయని వారికి మరో అవకాశం ఇచ్చారు. గతంలో పట్టాలు జారీచేసిన వారికి కన్వేయన్స్ డీడ్లు సిద్ధం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం పట్టాలు పంపిణీ నిర్వహించనున్నారు.
జీవో 296 కింద గతంలో పట్టాలు ఇచ్చిన 22,514 మందికి, జీవో 388 కింద 613 మందికి, జీవో 84 కింద యూఎల్‌సీ భూముల్లో ఆక్రమణల రెగ్యులేషన్ కింద 156 మంది కన్వేయన్స్ డీడ్లు పంపిణీ చేయనున్నారు. గాజువాకలోని ఇనాం భూముల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవో 45 కింద 943 మందికి, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జారీచేసిన జీవో 30 కింద 4,219 మందికి పట్టాలు పంపిణీ చేయనున్నారు. ముఖ్యంగా కన్వేయన్స్ డీడ్లు తీసుకున్న తరువాత ఇళ్లపై ఆక్రమణదారులకు పూర్తి హక్కులు దఖలు పడతాయి. అవసరాలకు ఇళ్ల క్రయవిక్రయాలు, తాకట్టు పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు పట్టాలు తీసుకుంటున్న ఆక్రమణదారులు వచ్చే రెండేళ్లలో కన్వేయన్స్ డీడ్లు పొందనున్నారు.
మండలాల వారీగా...
మండలం కన్వేయన్స్ డీడ్లు/పట్టాలు
విశాఖ రూరల్ 9,261
ములగాడ 4,213
గాజువాక 4,353
గోపాలపట్నం 3,253
పెందుర్తి 2,722
పెదగంట్యాడ 1,910
మహారాణిపేట 1,235
సీతమ్మధార 668
భీమునిపట్నం 464
ఆనందపురం 349
పద్మనాభం 17
సర్వం సిద్ధం
ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో పూర్తయిన ఏర్పాట్లు
10 గ్యాలరీలు...30 వేల కుర్చీలు
కన్వేయన్స్ డీడ్లు, పట్టాల పంపిణీకి 100 కౌంటర్లు ఏర్పాటు
లబ్ధిదారుల కోసం 400 బస్సులు
ఆహార ప్యాకెట్లు, స్నాక్స్ సిద్ధం
విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):
పట్టాల పంపిణీకి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 30 వేల మంది కూర్చునేలా భారీ షెడ్ నిర్మించారు. పది గ్యాలరీలు ఏర్పాటుచేసి, కుర్చీలు వేశారు. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులకు గ్యాలరీలు కేటాయించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారుల కోసం భారీవేదిక సిద్ధం చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు సభా కార్యక్రమం ప్రారంభం కానున్నది. 3.45 గంటల వరకు కొనసాగనున్నది. కాగా జిల్లాలోని 11 మండలాల నుంచి లబ్ధిదారులను సభా ప్రాంగణానికి తీసుకురావడానికి 400 బస్సులు ఏర్పాటుచేశారు. బస్సులు బయలుదేరే పాయింట్ వద్దే ప్రతి ఒక్కరికీ ఆహార పొట్లాలు అందించనున్నారు. వెజ్ బిర్యానీ, పెరుగన్నం, వాటర్ బాటిల్‌తో ఆహార పొట్లం ప్యాక్ చేశారు. సభా ప్రాంగణానికి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరికీ కేకు, బిస్కెట్ ప్యాకెట్, కూల్ డ్రింకు, వాటర్‌బాటిల్‌తో కూడిన స్నాక్స్ ప్యాకెట్ అందిస్తారు. పౌర సరఫరాల శాఖ ఆహారం, స్నాక్స్ ప్యాకెట్లు సిద్ధం చేసింది.
బస్సుల్లో లబ్ధిదారులను తీసుకురావడం మొదలు ఆహార ప్యాకెట్లు పంపిణీ వరకూ పర్యవేక్షణ నిమిత్తం అధికారులను నియమించారు. అదేవిధంగా కన్వేయన్స్ డీడ్లు, పట్టాల పంపిణీకి సభా ప్రాంగణంలో 100 కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఒక్కో కౌంటర్‌లో 300 మందికి పత్రాలు అందజేసేలా ఆరుగురు సిబ్బందిని నియమించారు. కౌంటర్ల వద్ద ఆయా మండలాల పేర్లను ప్రదర్శించనున్నారు. సభా వేదికపై కొద్దిమందికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా డీడ్లు, పట్టాలు పంపిణీ చేయిస్తారు. మిగిలిన వారికి ఆయా కౌంటర్లలో అందజేస్తారు. సభా ప్రాంగణం, పరిసరాల్లో బందోబస్తు కోసం భారీగా పోలీసులను నియమించారు. సభ ఏర్పాట్లను జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఇతర ప్రజా ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
నేడు ముఖ్యమంత్రి రాక
మధ్యాహ్నం 12.00 గంటలకు ఆర్కే బీచ్‌రోడ్డులో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’
2.00 గంటలకు ఏయూలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ
విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం నగరానికి వస్తున్నారు. ఆయన రెండు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఏయూ మైదానంలో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆర్కే బీచ్‌రోడ్డుకు వెళతారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు. పారిశుధ్య కార్మికులు, ప్రజలతో మాట్లాడతారు. అక్కడి నుంచి 12.55 గంటలకు బయలుదేరి పోర్టు గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. రెండు గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి చేరుకుంటారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. పలు మౌలిక వసతుల ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమం ముగించుకొని సాయంత్రం 3.45 గంటలకు బయలుదేరి భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయానికి వెళతారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ వెళతారు.