Share News

వేసవిలో మొక్కజొన్న సాగు లాభదాయకం

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:34 PM

వేసవిలో మొక్కజొన్న సాగు రైతులకు లాభదాయకమని చింతపల్లి ఆచార్య ఎన్‌జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు తెలిపారు.

వేసవిలో మొక్కజొన్న సాగు లాభదాయకం
పరిశోధన స్థానంలో సాగు చేస్తున్న మొక్కజొన్న పంట (ఫైల్‌)

నెలాఖరు వరకు నాట్లుకు అనుకూలం

నీటి సదుపాయం ఉంటే అధిక దిగుబడులు

చింతపల్లి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): వేసవిలో మొక్కజొన్న సాగు రైతులకు లాభదాయకమని చింతపల్లి ఆచార్య ఎన్‌జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు తెలిపారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఖరీఫ్‌లో మొక్కజొన్నను గిరిజన రైతులు 6,500 హెక్టార్లు, రబీలో 500 హెక్టారుల్లో సాగు చేస్తున్నారు. మార్చి మొదటి వారం నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో మొక్కజొన్న సాగుకు అనుకూలమైన వాతావరణం అందుబాటులో వుంటుంది. కేవలం మూడు నీటి తడులు పెట్టుకునేందుకు అనువైన భూముల్లో రైతులు మొక్కజొన్నను వేసవి పంటగా సాగు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అనువైన రకాలు:

దీర్ఘకాలిక రకాలు(100-120 రోజులు): డీహెచ్‌ఎం-113 ఎకరానికి 30-35 కిలోలు దిగుబడి.

మధ్యకాలిక రకాలు(90-100 రోజులు): డీహెచ్‌ఎం-117 ఎకరానికి 28-30 క్వింటాళ్ల దిగుబడి.

తీపిమొక్కజొన్న(75-80 రోజులు): ప్రియ, మాధురి ఎకరానికి 30 వేల పచ్చికండెల దిగుబడి.

విత్తే కాలం: మార్చి నెలాఖరు వరకు నాట్లు వేసుకోవచ్చు. మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు, వరుసల మధ్య 60 సెంటీమీటర్లు ఖాళీని పాటిస్తూ నాట్లు వేసుకోవాలి.

విత్తన మోతాదు: ఎకరానికి 7-8 కిలోలు, తీపిజొన్న 3-4 కిలోలు

గిరిజన ప్రాంత మొక్కజొన్నకు కావాల్సిన ఎరువులు

ఎకరానికి 175 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్పెట్‌, 35 కిలోలు పొటాస్‌ వేసుకోవాలి.

కలుపు నివారణ చర్యలు

పంట విత్తిన తర్వాత రెండు రోజుల్లోపు అట్రాజెన్‌ అనే కలుపు మందును నేల రకం బట్టీ 800-1200 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత 2-4-డి సోడియం సాల్ట్‌ 0.5 కిలోలు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 30-45 రోజులకు అంతర కృషి చేసుకుని కలుపు మొక్కలను నివారించుకోవాలి.

నీటియాజమాన్యం: నాట్లువేసిన తరువాత, 30-35, 55-60 రోజుల్లో మూడుసార్లు నీటి తడులు పెట్టుకోవాలి.

Updated Date - Mar 03 , 2026 | 11:34 PM