దుర్గావీధిలో కార్డెన్ సెర్చ్
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:35 AM
జీకేవీధి మండలం సీలేరు దుర్గావీధిలో సీలేరు పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రికార్డులు లేని ఆరు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.
ప్రతీ ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు
రికార్డులు లేని ఆరు ద్విచక్ర వాహనాలు సీజ్
సీలేరు, మార్చి1 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం సీలేరు దుర్గావీధిలో సీలేరు పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రికార్డులు లేని ఆరు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.
సీలేరు ఎస్‌ఐ యాసిన్ ఆధ్వర్యంలో దుర్గావీధిలో ఆదివారం ఉదయం కార్డెన్ సెర్చ్‌లో భాగంగా అన్ని ఇళ్లను తనిఖీ చేశారు. ఆధార్ కార్డులు, ఇతర నివాస ధ్రువీకరణ పత్రాలను ఎస్‌ఐ పరిశీలించారు. ఇంట్లో ఎంత మంది కుటుంబ సభ్యులు ఉన్నారు?, ఇతరులు ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీశారు. గంజాయి, మత్తు మందుల రవాణా, వాడకంపై ప్రత్యేకంగా వాకబు చేశారు. పలు ఇళ్ల వద్ద ఉన్న ద్విచక్ర వాహనాలపై ఆరా తీయగా ఆరు వాహనాలకు రికార్డులు లేవని గుర్తించారు. వెంటనే ఆ వాహనాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. రికార్డులను తీసుకువచ్చి వాహనాలను తీసుకువెళ్లాలని వాహనదారులకు సూచించారు. గిరిజన యువతతో పాటు దుర్గావీధిలో ఉంటున్న వారికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. బెట్టింగ్ గేమ్‌లు ఆడరాదని, గంజాయి రవాణా కోసం దళారులు డబ్బు ఆశ చూపినా ఆకర్షితులు కావద్దని సూచించారు. అనేక మంది గిరిజన యువకులు పట్టుబడి జైళ్లలో మగ్గుతున్నారని, దీంతో వారి జీవితం నాశనమవుతోందని చెప్పారు. మైనర్లు వాహనాలు నడుపుతూ తమకు పట్టుబడితే వాహన యాజమానిపై చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.