Share News

అనకాపల్లిలో కార్డన్‌ సెర్చ్‌

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:52 AM

మాదక ద్రవ్యాల వ్యాప్తిని పూర్తిగా అరికట్టడానికి చేపట్టిన ఆపరేషన్‌ వజ్రప్రహార్‌ కార్యక్రమంలో భాగంగా పోలీసులు గురువారం అనకాపల్లి పట్టణంలోని ఏఎంసీ కాలనీ, చేపల బజార్‌, విజయరామరాజుపేట ప్రాంతాల్లో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనకాపల్లిలో కార్డన్‌ సెర్చ్‌
ఏఎంసీ కాలనీలో కార్డన్‌ సెర్చ్‌కు హాజరైన పోలీసులు

ఏఎంసీ కాలనీ, చేపల బజార్‌, విజయరామరాజుపేటల్లో విస్తృత తనిఖీలు

తొమ్మిది ద్విచక్ర వాహనాలు, ఏడు కిలోల గంజాయి సీజ్‌

కొత్తూరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల వ్యాప్తిని పూర్తిగా అరికట్టడానికి చేపట్టిన ఆపరేషన్‌ వజ్రప్రహార్‌ కార్యక్రమంలో భాగంగా పోలీసులు గురువారం అనకాపల్లి పట్టణంలోని ఏఎంసీ కాలనీ, చేపల బజార్‌, విజయరామరాజుపేట ప్రాంతాల్లో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్పీ ఎం.శ్రావణి ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఉదయం 7.30 గంటల వరకు చేట్టిన ఈ కార్యక్రమంలో 14 మంది పోలీసు అధికారులు, 90 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నివాసాలు, వినియోగంలో లేని ఇళ్లు, ఖాళీ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. గంజాయి కేసుల్లో ప్రమేయం ఉన్న వారి ఇళ్లల్లో క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఎటువంటి రికార్డులు లేని తొమ్మిది ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేశారు. నిమ్మకాయల జ్యోతి సూర్య ప్రభాకర్‌ అలియాస్‌ జ్యోతి ఇంటి వద్ద మూడు కిలోల గంజాయి, దొడ్డి తిమోతి అలియాస్‌ ఆది ఇంటి వద్ద నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మల్లంపర్తి గణేశ్‌ ఇంటి వద్ద మెపెన్‌ట్రిమైన్‌ సల్ఫేట్‌ 165 ఇంజక్షన్‌ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ, డ్రగ్స్‌ రహితసమాజం ఏర్పాటుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే 1972 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ జి.ప్రేమ్‌కుమార్‌, ట్రాఫిక్‌ సీఐ వెంకటనారాయణ, రూరల్‌ సీఐ జి.అశోక్‌కుమార్‌, ఎస్‌ఐలు జి.రవికుమార్‌, జె.నాగేశ్వరరావు, డి.శ్రీనివాసరావు, సంతోష్‌కుమార్‌, భాస్కరరావు, వెంకటేశ్వరరావు, ట్రాఫిక్‌ ఎస్‌ఐలు శేఖరం, సత్యనారాయణ, అర్జునరావు, కశింకోట ఎస్‌ఐలు మనోజ్‌కుమార్‌, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:52 AM