Share News

సమన్వయంతో అటవీ భూ సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:21 AM

జిల్లాలో అటవీ భూ సమస్యలను ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

సమన్వయంతో అటవీ భూ సమస్యల పరిష్కారం
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

ఎంపిక చేసిన 110 గ్రామాల్లో సామాజిక అటవీ హక్కుల కల్పనకు కృషి చేయాలని సూచన

పాడేరు, ఫిబవరి 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అటవీ భూ సమస్యలను ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లాలో కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాలకు సంబంధించి అటవీ భూ సమస్యలపై కలెక్టరేట్‌లో అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ సదస్సులో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లోని ప్రజల నుంచి స్వీకరించిన వినతుల్లో ఇంకా అధిక సంఖ్యలో వినతులు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. వాటిని పరిష్కరించేందుకు అధికారులు వంద రోజుల ప్రణాళికను రూపొందించుకుని అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఆ మూడు మండలాల్లో భూముల మ్యుటేషన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలన్నారు. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో రెవెన్యూ, ఫారెస్ట్‌ భూములకు సంబంధించిన అంశాలపై ఇరు శాఖలు సమన్వయంతో క్షేత్ర పరిశీలనలు చేపట్టి మూడు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సరిహద్దులు, భూ రికార్డులు వివాదాస్పదంగా ఉన్నా పక్కాగా గుర్తించి సరిచేయాలన్నారు. పాత పట్టాలను, ప్రస్తుత రికార్డులను పరిశీలించి అర్హులైన గిరిజనులకు భూమి హక్కులు కల్పించాలని అధికారులకు సూచించారు. అటవీ హక్కుల చట్టంలో భాగంగా చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో గుర్తించిన 110 గ్రామాలకు సామాజిక అటవీ హక్కులను కల్పించేందుకు రెవెన్యూ, అటవీ శాఖాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లోని గిరిజనుల సంప్రదాయ జీవనానికి తోడ్పడుతుందన్నారు. రెవెన్యూ గ్రామాలకు లోకల్‌ గవర్నమెంట్‌(ఎల్‌జీ) కోడ్‌ను కేటాయించాలని, అప్పుడు ఆయా గ్రామాలకు ప్రభుత్వ పథకాలు, నిధులు, ఇతర ఆన్‌లైన్‌ సేవలను అందించేందుకు సులభంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో తిరుమణ శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, సీపీవో ప్రసాద్‌, పీఎంయూ ప్రాజెక్టు ఇంక్లిమెంటేషన్‌ ఆఫీసర్‌ రామ్‌గోపాల్‌, రెవెన్యూ, అటవీ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 12:21 AM