Share News

సమన్వయంతో గిరిజనాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:15 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ గిరిజన ప్రాంతాభివృద్ధికి సమన్వయంతో పని చేయాలని అరకులోయ పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ జి.తనూజరాణి అన్నారు.

సమన్వయంతో గిరిజనాభివృద్ధికి కృషి
మాట్లాడుతున్న ఎంపీ డాక్టర్‌ జి.తనూజరాణి, పక్కన కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, తదితరులు

దిశ సమావేశంలో అరకులోయ ఎంపీ డాక్టర్‌ జి.తనూజరాణి

రోగులకు అంబులెన్సుల సమస్య తలెత్తకుండా చూడాలని సూచన

పాడేరు, జనవరి 21(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ గిరిజన ప్రాంతాభివృద్ధికి సమన్వయంతో పని చేయాలని అరకులోయ పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ జి.తనూజరాణి అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణా కమిటీ(దిశ) సమావేశంలో ఆమె చైౖర్‌పర్సన్‌ హోదాలో మాట్లాడారు. గిరిజనులకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సంపూర్ణంగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని, స్థానిక వనరుల సద్వినియోగంపైనా దృష్టి సారించాలన్నారు. గిరిజన ప్రాంతంలో పనిని భారంగా భావించవద్దని, సేవా భావంతో పని చేయాలని సూచించారు. అలాగే అధికారులు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులకు సైతం తెలియజేయాలని, ఎంపీ ల్యాడ్స్‌లో చేపడుతున్న పనులపైనా ఆమె ఆరా తీశారు. గ్రామ సచివాలయాల్లో సిబ్బంది కొరత ఉందని, అనేక పాఠశాలల్లోని భోజన శాలలు, మరుగుదొడ్లు లేవని, వాటిని సమకూర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, మార్గమధ్యంలోని గ్రామస్థుల రాకపోకలకు అనువుగా డైవర్షన్‌ మార్గాలను ఏర్పాటు చేయాలన్నారు.

అంబులెన్సుల సమస్యలు తలెత్తకుండా చర్యలు

జిల్లాలో రోగులకు అంబులెన్సులు సమకూర్చడంలో సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఎంపీ డాక్టర్‌ జి.తనూజరాణి ఆదేశించారు. జిల్లాలో తగినన్ని అంబులెన్సులు ఉన్నప్నటికీ సమస్యలు ఏర్పడడం సరికాదని, వాటి మరమ్మతులను సైతం సకాలంలో చేపట్టాలన్నారు. అంబులెన్సుల సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని, ఇకపై వాటి గురించి ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ శాఖలోనూ సమీక్షలు జరగాలని, అలాగే ఎటువంటి సమీక్షకైనా విధిగా సంపూర్ణ సమాచారంతో హాజరుకావాలన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 11:15 PM