Share News

జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కృషి

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:35 AM

వివిధ శాఖలకు చెందిన అధికారులు జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లా అభివృద్ధిపై మంగళవారం క్యాంప్‌ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కృషి
వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

- అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

పాడేరు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): వివిధ శాఖలకు చెందిన అధికారులు జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లా అభివృద్ధిపై మంగళవారం క్యాంప్‌ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ప్రధానంగా పీఎం జన్‌మన్‌ ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఎంపీడీవోలు, స్వర్ణగ్రామ శాఖాధికారులు వారంలో నాలుగు సచివాలయాలను సందర్శించి, జరుగుతున్న పనులపై ఆరా తీయాలన్నారు. సచివాలయాల సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకోవాలని, పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను విధిగా తొలగించాలని, పల్లెల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలన్నారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. జనగణనకు సిబ్బంది సిద్ధం కావాలని, ఏకీకృత కుటుంబ సర్వే పెండింగ్‌ పనులు పూర్తి చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, టేక్‌ హోమ్‌ రేషన్‌ పద్ధతిలో ఇంటికే పోషకాహారం అందించాలని, ఐసీడీఎస్‌, వైద్యారోగ్య సేవలు మెరుగ్గా అందించాలని ఆదేశించారు. మాతాశిశు మరణాలను అరికట్టాలని, ఆశా వర్కర్ల సేవలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో మహాప్రస్థానం అంబులెన్సులు రెండు అందుబాటులో ఉంచాలని, ఆరోగ్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమాని శ్రీపూజ, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ కృష్ణమూర్తినాయక్‌, హౌసింగ్‌ పీడీ బి.బాబునాయిక్‌, డ్వామా పీడీ విద్యాసాగరరావు, డీఈవో రామకృష్ణారావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖరావు, స్వర్ణగ్రామ శాఖ జిల్లా నోడల్‌ అధికారి పీఎస్‌.కుమార్‌, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2026 | 12:35 AM