సమగ్ర గిరిజనాభివృద్ధికి సమన్వయంతో కృషి
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:27 AM
వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంలో గిరిజనుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ ఆర్.బాలసుబ్రహ్మణ్యం అన్నారు. కలెక్టర్ టి.నిషాంతితో కలిసి కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆకాంక్షిత జిల్లాగా గుర్తింపు పొంది, ప్రత్యేక పథకాలు, సదుపాయాలు ఈ జిల్లాకు లభించాయని, వాటిని లబ్ధిదారులైన గిరిజనులకు సమగ్రంగా అందించాలన్నారు.
- నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ ఆర్.బాలసుబ్రహ్మణ్యం
- గిరిజనులకు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచన
పాడేరు, ఆగస్టు 11(ఆంఽధ్రజ్యోతి): వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంలో గిరిజనుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ ఆర్.బాలసుబ్రహ్మణ్యం అన్నారు. కలెక్టర్ టి.నిషాంతితో కలిసి కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆకాంక్షిత జిల్లాగా గుర్తింపు పొంది, ప్రత్యేక పథకాలు, సదుపాయాలు ఈ జిల్లాకు లభించాయని, వాటిని లబ్ధిదారులైన గిరిజనులకు సమగ్రంగా అందించాలన్నారు. గిరిజన విద్యార్థుల కోసం పాఠశాలల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలలు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందాలన్నారు. గిరిజన గ్రామాలకు రోడ్లు, రవాణా, వైద్య సదుపాయాలతో పాటు తాగునీరు, విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. అలాగే గ్రామాల్లో సామాజిక గ్రంథాలయాలను బలోపేతం చేసి గిరిజన యువతను పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగు, మార్కెటింగ్, ఆదాయం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రతి గడపకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలని ఆయన సూచించారు. జిల్లాలోని మండలాల పర్యటనలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించానని, చక్కని ఫలితాలు వచ్చాయని పేర్కొంటూ జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా జిల్లాలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి అన్ని శాఖలు చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ టి.నిషాంతి ఆయనకు వివరించారు. అలాగే ఆయనకు జ్ఞాపికను అందించిన సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ సమిదాసింగ్, జాయింట్ కలెక్టర్ టి..శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్.లోకేశ్వరరావు, ఆర్‌డీవో ఎం.భుజంగరావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో విస్తృత పర్యటన
జిల్లాలో నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పాడేరు, అరకులోయ, అనంతగిరి, హుకుంపేట మండలాల్లో పలు కేంద్ర పభుత్వ పథకాలను ఆయన పరిశీలించారు. తొలుత ఆయన అనంతగిరి మండలంలోని కాఫీ హబ్‌ను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ కాఫీ రైతులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. అలాగే అరకులోయ మండలం చొంపి గ్రామంలో పర్యాటకుల కోసం సిద్ధం చేసిన హోమ్ స్టేలను సందర్శించి, వాటి వినియోగం, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాలు, ఆహార అలవాట్లు, ధింసా ప్రదర్శన, పర్యాటకుల అభిరుచులపై అభిప్రాయాలను సేకరించారు. హుకుంపేట మండలం జామిగుడ గ్రామంలో ఆదిమ జాతి గిరిజనుల కోసం నిర్మిస్తున్న ప్రధానమంత్రి జన్‌మన్ యోజన ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. తర్వాత పాడేరు మండలం గుత్తులపుట్టులో గిరిజన రైతులు అవలంభిస్తున్న ప్రకృతి సేద్య పద్ధతులు, రైతు సాధికార సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. పాడేరులో గిరిజన అభ్యర్థులకు నిర్వహిస్తున్న ఏఐ శిక్షణ, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, విలువిద్య శిక్షణ, జీసీసీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ సమిదాసింగ్, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రైతు సాధికారత సంస్థ ప్రాజెక్టు మేనేజర్ ఎల్.భాస్కరరావు, ఐటీడీఏ ఏపీవో(పీవీటీజీ) ఎం.వెంకటేశ్వరరావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.