Share News

వంట గ్యాస్‌కు కటకట

ABN , Publish Date - Mar 13 , 2026 | 01:11 AM

జిల్లాలో వంట గ్యాస్‌ ఇబ్బందులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

వంట గ్యాస్‌కు కటకట

మూసివేత దిశగా హోటళ్లు, రెస్టారెంట్లు

గ్యాస్‌ డీలర్లు, హోటలియర్లతో జేసీ సమావేశం

అన్నదానం, ప్రసాదాలకు గ్యాస్‌ ఇవ్వాలని సింహాచలం, కనకమహాలక్ష్మి ఆలయ ఈఓల లేఖలు

మరోవైపు బ్లాక్‌లో డొమెస్టిక్‌ సిలిండర్లు

రూ.1,500కు అమ్మకం

పౌర సరఫరాల శాఖ అధికారుల దాడులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో వంట గ్యాస్‌ ఇబ్బందులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇళ్లలో ఉపయోగించే డొమెస్టిక్‌ సిలిండర్ల సరఫరాకు ప్రస్తుతం ఇబ్బందులు లేకున్నా హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సంస్థలకు సరఫరా చేసే వాణిజ్య సిలిండర్లు మాత్రం 90 శాతం మందికి అందడం లేదు. ఈ సిలిండర్ల ఫిల్లింగ్‌ను నిలిపివేశారు. గ్యాస్‌ డీలర్ల వద్ద స్టాకులు పూర్తిగా తగ్గిపోయాయి. అరకొరగా ఉన్నవారు ప్రధాన స్టార్‌ హోటళ్లకు రేషన్‌ ప్రకారం అందిస్తున్నారు. జగదాంబ సెంటర్‌లో ఉన్న ప్రముఖ హోటల్‌కు రోజుకు 20 సిలిండర్లు అవసరం కాగా వారికి పది ఇవ్వడం కూడా కష్టంగా ఉంది. ఇలా స్టార్‌ హోటళ్లకు డిమాండ్‌లో 40 నుంచి 50 శాతం మాత్రమే అందుతున్నాయి. సాధారణ హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్‌లకు అసలు అందడం లేదు. దాంతో వారంతా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని సరఫరా చేయకపోతే వ్యాపారాలు మూసుకోక తప్పదని వారు వాపోతున్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ సమావేశం

వాణిజ్య గ్యాస్‌ కొరత తీవ్రం కావడంతో జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనికి నగరంలోని గ్యాస్‌ డీలర్లను, హోటళ్ల అసోసియేషన్‌ ప్రతినిధులను పిలిపించారు. తమ వద్ద డొమెస్టిక్‌ తప్ప వాణిజ్య సిలిండర్లు లేవని, కంపెనీలు సరఫరా చేయడం లేదని డీలర్లు స్పష్టంచేశారు. తమకు వాణిజ్య సిలిండర్లు సరఫరా చేయకపోతే వ్యాపారాలు చేసుకోలేమని, ఏదోవిధంగా చూడాలని హోటల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. అందుకు జేసీ వారికి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. జిల్లాలో ఎన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్‌లు ఉన్నాయో తనకు జాబితా ఇచ్చినట్టయితే ప్రభుత్వంతో చర్చించి ఏదో ఒక ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం జాబితా ఇస్తామని విశాఖపట్నం హోటల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు జేసీకి తెలిపారు. ఈ సందర్భంగా జేసీ విద్యాధరి మాట్లాడుతూ, ఎవరైనా సరే నిబంధనలకు వ్యతిరేకంగా డొమెస్టిక్‌ సిలిండర్లు వాడితే ఇచ్చిన వారిపైనా, ఉపయోగిస్తున్న వారిపైనా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

34 సిలిండర్లు స్వాదీనం

వాణిజ్య సిలిండర్ల సరఫరా లేకపోవడంతో డొమెస్టిక్‌ సిలిండర్లకు డిమాండ్‌ ఏర్పడింది. దీంతో గ్యాస్‌ సరఫరా చేసే బాయ్‌లు డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.960 కాగా బయట రూ.1,500 చొప్పున అమ్ముకుంటున్నారు. కొందరి వద్ద వాణిజ్య సిలిండర్లు ఉండగా, వాటిని రూ.3 వేలు (అసలు ధర రూ.1,990) చొప్పున విక్రయిస్తున్నారు. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు దృష్టి సారించారు. సోదాలు నిర్వహించి పలు ప్రాంతాల్లో 34 డొమెస్టిక్‌ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆ రెండు ఆలయాలకు ప్రత్యేక సరఫరా

నగరంలో సింహాచలం దేవస్థానం, కనకమహాలక్ష్మి దేవస్థానం ఉన్నాయి. ఇక్కడ రోజూ ప్రసాదం కింద పులిహోర, లడ్డూ, పొంగళి వంటివి తయారుచేస్తారు. అదేవిధంగా భక్తులకు నిత్య అన్నదానం ఉంటుంది. వారికి కూడా గ్యాస్‌ అవసరమే. ఈ రెండు ఆలయాలకు భక్తులకు పెట్టే అన్నదానం కోసం తయారుచేసే వంటకాలకు డొమెస్టిక్‌ గ్యాస్‌ సరఫరా చేస్తున్నారు. విక్రయించే ప్రసాదాల తయారీకి వాణిజ్య సిలిండర్లు వాడాలి. కనకమహాలక్ష్మి దేవస్థానంలో నెలకు 300 సిలిండర్లు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వారి దగ్గర ఆరు సిలిండర్లు మాత్రమే ఉండడంతో కలెక్టర్‌కు లేఖ రాసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా తమకు ఆటంకం లేకుండా గ్యాస్‌ ఇవ్వాలని కలెక్టర్‌కు రాయగా అంగీకరించారని సింహాచలం ఈఓ జె.వెంకటరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Mar 13 , 2026 | 01:11 AM