Share News

ఆశ్రమ పాఠశాలకు వంట గ్యాస్‌ కొరత

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:47 PM

జీకేవీధి మండలంలోని పలు ఆశ్రమ పాఠశాల్లో వంట గ్యాస్‌ కొరత ఏర్పడింది. దీంతో వంట చేయడానికి వర్కర్లు, పాఠశాల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆశ్రమ పాఠశాలకు వంట గ్యాస్‌ కొరత
సీలేరు బాలుర గురుకుల పాఠశాలలో కర్రల పొయ్యిపై వంట చేస్తున్న సిబ్బంది

కట్టెల పొయ్యిపై వండుతున్న సిబ్బంది

సరిపడా సిబ్బంది లేక అవస్థలు పడుతున్న కుక్‌లు

సీలేరు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలంలోని పలు ఆశ్రమ పాఠశాల్లో వంట గ్యాస్‌ కొరత ఏర్పడింది. దీంతో వంట చేయడానికి వర్కర్లు, పాఠశాల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీలేరు, ధారకొండ ఆశ్రమ పాఠశాలల్లో శుక్రవారం నుంచి గ్యాస్‌ కొరత ఏర్పడింది. సీలేరు బాలుర గురుకుల పాఠశాల, బాలికల ఆశ్రమ పాఠశాల, ధారకొండ ఆశ్రమోన్నత పాఠశాల, సప్పర్ల ఆశ్రమోన్నత పాఠశాలల్లో వండడానికి వంట గ్యాస్‌ లేదు. దీంతో ప్రత్యామ్నాయంగా కట్టెలను వినియోగించి వంట చేస్తున్నారు. అయితే వంట సిబ్బంది అరకొరగా ఉండడంతో కర్రల పొయ్యి మీద వంట చేయడం చాలా కష్టమని వసతి గృహాల కుక్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీలేరు గురుకుల పాఠశాలలో 480 మంది విద్యార్థులు ఉండగా.. ఇక్కడ వంట చేయడానికి ముగ్గురు సిబ్బంది ఉన్నారు. బాలికల ఆశ్రమ పాఠశాలలో 277 మంది విద్యార్థులు ఉండగా.. ఒక్కరే కుక్‌ ఉన్నారు. ధారకొండ ఆశ్రమ పాఠశాలో 275 మంది విద్యార్థులు ఉండగా.. ఒక్కరే కుక్‌ ఉన్నారు. సప్పర్ల ఆశ్రమ పాఠశాలలో 275 మంది విద్యార్థులు ఉండగా.. ఒక్కరే కుక్‌ ఉన్నారు. ఆశ్రమ పాఠశాలకు వంట గ్యాస్‌ సరఫరాపై ఆయా పాఠశాల వార్డెన్‌లు జీసీసీ గ్యాస్‌ గోదాం సిబ్బంది, అధికారుల వద్దకు వెళ్లినప్పటికీ హెచ్‌పీసీఎల్‌ నుంచి అనుమతులు వస్తేనే తప్ప వసతి గృహాలకు గ్యాస్‌ సరఫరా చేయలేమని చెబుతున్నారని ఆశ్రమ పాఠశాలల సిబ్బంది చెబుతున్నారు. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్‌ కొరత లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:47 PM