Share News

వాగులు దాటితేనే వంటా-వార్పు

ABN , Publish Date - Nov 14 , 2026 | 10:39 PM

మండలంలో మఠంభీమవరం పంచాయతీ జెర్రిగొంది గ్రామస్థులు మూడు కొండ వాగులు దాటితేనే వంటా-వార్పు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి.

వాగులు దాటితేనే వంటా-వార్పు
పలకజీడి డిపో నుంచివాగు దాటి రేషన్‌ తెచ్చుకుంటున్న జెర్రిగొంది గ్రామస్థులు

మూడింటిని దాటి రేషన్‌ తీసుకోవాలి

రేషన్‌ కోసం 26 కిలోమీటర్లు నడవాలి

రోడ్డు సౌకర్యం లేక ఇక్కట్లు

పెదఅగ్రహారం డిపోలో రేషన్‌ ఇప్పించాలి

ఇదీ జెర్రిగొంది గ్రామ గిరిజనుల అవస్థలు

కొయ్యూరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):

మండలంలో మఠంభీమవరం పంచాయతీ జెర్రిగొంది గ్రామస్థులు మూడు కొండ వాగులు దాటితేనే వంటా-వార్పు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గ్రామం వెళ్లాలంటే 26 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. ఇక్కడ 22 కుటుంబాలకు చెందిన 150 జనాభా నివసిస్తున్నారు. జెర్రిగొంది గ్రామం వెళ్లాలంటే.. పలకజీడి మీదుగా మర్రిపాకలు నుంచి కొండలు, వాగులు దాటి 26 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. లేకుంటే గూడెం కొత్తవీధి నుంచి కుంకుంపూడి, వాడమామిడి, పెద్దఅగ్రహారం, చినఅగ్రహారం మీదుగా జెర్రిగొంది చేరకోవచ్చు. ఈ గ్రామస్థులకు పలకజీడి రేషన్‌ డిపో నుంచి నిత్యావసర సరకులు అందజేస్తున్నారు. దీంతో వీరు ప్రతి నెలా కొండలపై నుంచి నడిచి మూడు కొండ వాగులు దాటి రేషన్‌ సరుకులు తీసుకొని రావాలి. వీరికి సమీపంలో గూడెంకొత్తవీధి మండలం పెదఅగ్రహారంలో రేషన్‌ డిపో ఉంది. ఈ డిపో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండడమే కాకుండా ప్రతి నెలా నిత్యావసర సరకులు పొందేందుకు అనువుగా ఉంటుంది. ఈ డిపోలో జెర్రిగొంది రేషన్‌కార్డులు విలీనం చేసి నిత్యావసర సరకులు అందించాలని ఆ గ్రామస్థులు కోరుతున్నా పట్టించుకునే నాఽథుడే కరువయ్యారని ఆ గ్రామస్థులు వాపోతున్నారు. దీంతో ప్రతి నెలా మూడు కొండవాగులు దాటి 26 కిలోమీటర్లు నడిస్తేనే వంటా-వార్పుకు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని జెర్రిగొంది గ్రామస్థులు తెలిపారు. తమ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వాగులపై వంతెనలు నిర్మించి, రోడ్డు వేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. తమ గ్రామానికి రోడ్డు వేసేందుకు తాము శ్రమదానం కూడా చేస్తామని వారు చెబుతున్నారు. ఆ దిశగా అధికారులు ఆలోచన చేస్తే మారుమూల గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామానికి రోడ్డు సౌకర్యంతోపాటు తమ రేషన్‌ కార్డులను పెదఅగ్రహారం డిపోలో విలీనం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Nov 14 , 2026 | 10:39 PM